కెసిఆర్ చిత్రానికి నల్లరంగు: ఎపి ప్రభుత్వ అవమానం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవమానించింది. ఆ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన విశేషాలతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాల ప్రదర్శనలో సీఎం కేసీఆర్ ముఖానికి ఏపీ ప్రభుత్వం నల్లరంగు వేసింది.
శంకుస్థాపన వేదికపై కేసీఆర్‌తోపాటు ఉన్నవారి ముఖాలన్నీ స్పష్టంగా కనిపిస్తుండగా ఆయన ముఖాన్ని మాత్రమే కనిపించనీయకుండా చేసింది. గత నెల 22న జరిగిన అమరావతి శంకుస్థాపనకు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా హైదరాబాద్‌కు వెళ్లి మరీ ఆహ్వాన పత్రికను అందించి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఈ ఆహ్వానం మేరకు అమరావతికి వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. తాజాగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగనున్న ఎగ్జిబిషన్ సందర్భంగా అమరావతి గొప్పదనాన్ని దేశ ప్రజలకు తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఓ షొటో ఎగ్జిబిషన్ తరహాలో ఛాయాచిత్రాల ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో ఏర్పాటు చేశారు.
కానీ శంకుస్థాపనకు హాజరైన కేసీఆర్ ముఖాన్ని మాత్రం గ్రాఫిక్స్‌లో ఉద్దేశపూర్వకంగా నల్లరంగుతో మాస్క్ వేసి స్పష్టంగా కనబడకుండా చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగు చిత్రాల్లోనూ అదే పనిచేశారు. కేసీఆర్‌కు పక్కన ఉన్న చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉండగా, వారి మధ్యలోనే ఉన్న కేసీఆర్ ముఖం మాత్రం నల్లగా గుర్తు పట్టడానికి వీల్లేకుండా చేశారు.












Click it and Unblock the Notifications