4గురు రేప్ ఎలా చేస్తారు, ఇది అసాధ్యం!: ములాయం
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఒకేసారి ఎలా అత్యాచారం చేస్తారని, అదంతా వట్టిదేనని వ్యాఖ్యానించారు.
కుటుంబంలోని ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే దానిని మిగిలిన పురుషులకు ఆపాదిస్తున్నారని చెప్పారు. అసలు నలుగురు వ్యక్తులు ఓ మహిళ పైన అత్యాచారం చేయడం అసాధ్యమని చెప్పారు.

ఇలాంటి కేసులను తాను చాలా చూశానని, ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే అతని సోదరులను కేసులో ఇరికిస్తున్నారని వ్యాఖ్యానించారు. అసలు గ్యాంగ్ రేప్‌లు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు, పెరుగుతున్న హింసపై విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారాలు, నేరాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే ప్రతి నేరంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. అయితే, ములాయం వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications