చెదిరిన కల: ప్రాణం పోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం
గుంటూరు: ఎంతో కష్టపడి ప్రభుత్వం కొలువు కోసం సిద్ధమయ్యాడు. అంధుడైనా ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షరాశాడు. అనంతరం వచ్చిన ఫలితాల్లో గ్రూప్-4 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉద్యోగం చేతికందే సమయానికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఫలితాలు, ఉద్యోగ నియామకాల్లో జరిగిన అమితమైన ఆలస్యం కారణంగానే అతను తన ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేర్చుకోకుండానే ప్రాణాలు వదిలాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొండముది గ్రామానికి చెందిన కోండ్రు నాగరాజు(41) అంధుడు. జిల్లాలో 2015 మార్చి 31వ తేదీన వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్‌లో క్లాస్-4 ట్యాంక్ క్లీనర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.
అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ నియామక ప్రక్రియ కొనసాగింది. నాగరాజు మెరిట్‌లిస్ట్‌లో, షార్టు లిస్టులో అర్హత సాధించటంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యాడు.
అనంతరం వికలాంగత్వం జన్యునిటీ సర్టిఫికెట్ కోసం జనవరిలో హైదరాబాద్‌కు వెళ్లాడు. ఫిబ్రవరిలో ఆ సర్టిఫికెట్ అందింది. దీంతో నియామక ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారు. అంతలోనే మార్చి 1న హైబీపీ కారణంగా తలలో నరాలు పగిలి నాగరాజు చనిపోయినట్లు వికలాంగశాఖ కార్యాలయానికి సమాచారం వచ్చింది.

ఏడాదిపాటు సాగిన నియామక ప్రక్రియ
గత సంవత్సరం మార్చి 31న జిల్లాలో క్లాస్-4, గ్రూప్-4కు సంబంధించి 74 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. క్లాస్-4కు సుమారు 3,700 దరఖాస్తులు రాగా, వాటిని క్లాసిఫికేషన్ చేసి మెరిట్ లిస్టు తయారు చేయటానికి వికలాంగుల శాఖ అధికారులకు 5నెలల సమయం పట్టింది. సెప్టెంబరులో లిస్టు విడుదల చే శారు. నెలరోజులపాటు అభ్యంతరాలు స్వీకరించారు.
డిసెంబర్‌లో షార్ట్ లిస్టును విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను జన్యునిటీ టెస్టు కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. జనవరిలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో సర్టిఫికెట్‌లు అందజేశారు.
కాగా, నియామక ఉత్తర్వులు సిద్ధం చేసి ఈ గురువారం ఉదయం అభ్యర్థులకు ఇవ్వనున్నారు. కాగా, నాగరాజు మృతిపై నిరుద్యోగ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే అతని ప్రాణం తీసిందని, ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా జరిగి ఉంటే అతడు ప్రాణాలతో ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగపై నైరాశ్యానికి గురైన నాగరాజు మానసిక ఆందోళనతో మృతి చెందాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications