పాక్‌లో పెరిగిన గీత మన తెలుగు బిడ్డేనా?: డీఎన్ఏ పరీక్షలు
న్యూఢిల్లీ: చిన్నతనంలోనే తప్పిపోయి పాకిస్థాన్‌లో ప్రవేశించి అక్కడి ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో పెరిగి పెద్దదైన భారత్‌కు చెందిన ఓ మూగ యువతి తల్లిదండ్రుల విషయంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రస్తుతం 20ఏళ్ల వయస్సున్న గీతను తెలంగాణలోని భద్రాచలంకు చెందిన ఓ తల్లిదండ్రులు తమ కూతురేనంటూ చిన్ననాటి ఫొటోలు కూడా చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదివాసీ దంపతులు బజ్జరి కిష్టయ్య, గోపమ్మలకు మంగళవారం ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో వైద్యులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం భోపాల్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో బంధువు నాగేశ్వర్‌రావుతో కలిసి ఆ దంపతులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా వారి బంధువు నాగేశ్వర్‌రావు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. 2006 జనవరిలో గుంటూరు జిల్లా కాకానిలో జరిగిన క్రైస్తవ మహాసభలకు 11ఏళ్ల కూతురు రాణితో కలిసి కిష్టయ్య దంపతులు వెళ్లారు. అక్కడ రెండోరోజు జనం తాకిడి ఎక్కువకావడంతో పాప తప్పిపోయింది. మూగ, చెవిటి అమ్మాయి కావడంతో వివరాలు చెప్పలేకపోయింది.

మళ్లీ ఆశలు
అప్పటి నుంచి చర్చి పాస్టర్లతో కలిసి తల్లిదండ్రులు నెలల తరబడి గాలించినా లాభం లేకపోయింది. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తమ కూతురు ఇక తిరిగిరాదని ఆ కుటుంబం ఆశలు వదులుకుంది. కాగా, నిరుడు కిష్టయ్య దంపతులు పేపర్లో గీత ఫొటో చూశారు. పోలికలు తమ కూతురులాగే ఉండటంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి.

ఇండోర్‌లో గీత
గీత సంరక్షణ బాధ్యతలను మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అప్పగించింది. అయితే, ఆ అమ్మాయిని చూడడానికి ఎవ్వరికీ అనుమతి లేదు.

గీత మా రాణే
ఆ గీత మా రాణియేనని భద్రాచలం కిష్టయ్య దంపతులు చెబుతున్నారు. ఆమె పొలికలు తమ కూతురు పోలికలతో సరిపోయాని అంటున్నారు. ముక్కు, నొసలు, చెవి కింద పులిపిర్లు... మొత్తంగా గీత అచ్చం తమ అమ్మాయిలానే ఉందని, తమ దగ్గర ఐదేళ్ల వయసు ఉండగా తీసిన రాణి ఫొటో కూడా ఉందని చూపిస్తున్నారు. ఈ ఫొటోతో పోల్చుకున్నా సరిపోతుందని రాణి తల్లిదండ్రులు కిష్టయ్య, గోపమ్మ పేర్కొన్నారు. డీఎన్‌ఏ పరీక్షల్లో తమ కూతురే అని తప్పకుండా తేలుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పరీక్షలు తమకు అనుకూలంగా వస్తే తమ అమ్మాయిని తమకివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కిష్టయ్య దంపతులు చెప్పారు.












Click it and Unblock the Notifications