ఆ 'పదాల'పై గుర్రు: నేను రానని జైట్లీకి బాబు షాక్, ప్రకటన ఆలస్యం వెనుక..
విజయవాడ: ఏపీకి ప్రత్యక ప్యాకేజీ పైన బుధవారం అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే కంటే ముందు ఆ కాపీనీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. దీనిని ఆయన దాదాపు పదిసార్లు చదివారని తెలుస్తోంది.
బాబు ఆగ్రహం-వెంకయ్య చక్రం, దిగొచ్చిన మోడీ: ప్యాకేజీ ఇలా!
ప్యాకేజీలోని కొన్ని పదాల పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ఆయనకు ఏడు పేజీల లేఖను పంపించింది. దీనిని చంద్రబాబు పదిసార్లు క్షుణ్ణంగా చదివారు. అందులో ప్యాకేజీ, నిధుల సాయం పైన.. 'చేస్తాం, చూస్తాం, పరిశీలిస్తాం' అన్న అర్థం వచ్చే పదాల పైన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అలాంటి పదాలకు ప్యాకేజీలో చోటు ఉండకూడదని చంద్రబాబు సూటిగా చెప్పారు. తనకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్య నాయుడులకు ఆయన ఇదే విషయాన్ని చెప్పేశారు. ఈ ముసాయిదా రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అందులో పలు మార్పులకు పట్టుబట్టారు. దీంతో దీంతో దాదాపు బుధవారం రాత్రి వరకు ప్యాకేజీ ముసాయిదాపై ఢిల్లీలో కసరత్తు కొనసాగింది.

జైట్లీ ప్రకటన ఆలస్యం వెనుక..
జైట్లీ ప్రకటన బుధవారం మధ్యాహ్నమే వస్తుందని తొలుత చెప్పారు. అయితే, అది తీరా రాత్రి పావు తక్కువ పదకొండు గంటలకు వచ్చింది. జైట్లీ ప్రకటన ఆలస్యానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబుకు ప్యాకేజీకి సంబంధించిన 7 పేజీల లేఖను పంపించారు. దానిలో చంద్రబాబు కొన్ని పదాలపై అభ్యంతరం చెప్పారు. దీంతో వాటిలో మార్పులు చేసే ప్రయత్నం జరిగింది. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

ఆలస్యం వెనుక.. ఆర్థిక శాఖ అభ్యంతరం
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ, దాని కింద కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల ద్వారా కలిగే లబ్ధిగా ఏటా రూ.2700 కోట్లు ఇవ్వాలని తొలుత నిర్ణయించుకున్నారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిధిని ఏ పద్దు కింద ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఈ ప్రతిపాదనకు సవరణలు చేయవలసి వచ్చింది.

ఆలస్యం వెనుక.. ఆర్థిక శాఖ అభ్యంతరం.. పారిశ్రామిక నిధి
జీఎస్టీ నేపథ్యంలో పన్ను, పారిశ్రామిక రాయితీలు ప్రత్యేకంగా ఇవ్వలేమని కేంద్రం అంచనాకు వచ్చిందని, దీంతో పారిశ్రామిక అభివృద్ధి నిధికి రూ.500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపైనా ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తర్జన భర్జన పడ్డారు. ప్రస్తుతానికి దానిపై ప్రకటన చేయలేదు.

జైట్లీకి నో చెప్పిన బాబు
పోలవరం ప్రాజెక్టు ఖర్చు పైనా తర్జన భర్జన జరిగింది. మరో ముఖ్య విషయమేమంటే.. చంద్రబాబు సమక్షంలో ప్రకటన చేయాలని భావించారు. అయితే, హోదాలేని ప్రకటనలో తాను భాగస్వామిని కానని చంద్రబాబు చెప్పడం వల్ల ఆలస్యమైందంటున్నారు.












Click it and Unblock the Notifications