మాల్యాగారి రూ.150 కోట్ల ఫ్లైట్ కోటీయే పలికింది
ముంబై: ఏదో అనుకుని ఏదో చేస్తే మరేదో ఎదురైంది. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా ఎగవేసి విదేశాలకు పారిపోయన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం ఏదో అనుకుంటే ఏమీ కాకుండా పోయింది. బకాయిల వసూళ్లలో భాగంగా దీన్ని సర్వీస్ ట్యాక్స్ శాఖ వేలం వేసింది. అయితే కేవలం ఒక్క బిడ్ మాత్రమే దాఖలైంది.
అది కూడా ముక్కున వేలేసుకునే విధంగా ఉంది. విమానం విలువ 152 కోట్ల రూపాయలుగా నిర్ణయించి వేలానికి పెడితే యుఎఇకి చెందిన ఏవియేషన్ సంస్థ అల్నా ఏరో డిస్ట్రిబ్యూషనల్ ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ కేవలం 1.09 కోట్ల రూపాయలతో బిడ్ వేసింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థ కోటి రూపాయలను డిపాజిట్ చేసింది కూడా. దీంతో కంగుతిన్న సేవా పన్ను శాఖ అధికారులు వేలాన్ని నిలిపివేశారు.

గురువారం సాయంత్రం సేవా పన్ను అధికారిక వేలందారు ఎమ్‌ఎస్‌టిసి ఈ వేలాన్ని నిర్వహించిందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ 800 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడటంతో 2013 డిసెంబర్‌లో సేవా పన్ను శాఖ దీన్ని అటాచ్ చేసినది తెలిసిందే.
గతంలో కూడా బకాయిల వసూళ్ల కోసం మాల్యా తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లకు ఇలాంటి అనుభవమే ఎదురవడం గమనార్హం. మొత్తానికి మాల్యా నుంచి ఏ రకంగానూ పైసా వసూలు కాకపోతుండటంతో అప్పులిచ్చిన బ్యాంకులు, బాకీలు పడ్డ సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. చేసుకున్నవారికి చేసుకున్నంత అంటే ఇదేనేమో...












Click it and Unblock the Notifications