మళ్లీ అడుగుపెడితే తిరిగి వెళ్లవ్: శశికళ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్..
శశికళకు మద్దతు ఇచ్చినందుకు 'ఇంకోసారి నియోజకవర్గంలో అడుగిపెడితే తిరిగి వెళ్లలేవు' అంటూ అక్కడి స్థానికులు ఎమ్మెల్యేను హెచ్చరించారు.
చెన్నై: అధికారంలో తన అనుయాయిని కూర్చోబెట్టి మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు శశికళ. ఎమ్మెల్యేలను పట్టుజారిపోకుండా కాపాడుకోగలిగారు గానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మాత్రం శశికళకు ఎప్పటికైనా ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజాగా శశికళ శిబిరానికి మద్దతునిచ్చిన ఓ అన్నాడీఎంకె ఎమ్మెల్యేకు సొంత నియోజకవర్గం నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. మరోసారి నియోజకవర్గంలో అడుగుపెడితే తిరిగి ఇక్కడినుంచి వెళ్లలేవంటూ స్థానికులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా శశికళకు మద్దతునిచ్చిందుకు అన్నాడీఎంకె ఎమ్మెల్యే, హాస్యనటుడు కరుణాస్ కు ఎదురైన చేదు అనుభవం.

కాగా, శశికళ-పన్నీర్ మధ్య సాగిన వార్ లో శశికళ తరుపు నిలబడ్డ కరుణాస్.. చిన్నమ్మ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఓ వివాదస్పద వ్యాఖ్య చేశారు. పళనిస్వామి ఎన్నిక అనంతరం..'ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే చాలని, ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని' ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి జనం కరుణాస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గంలోను ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
నియోజకవర్గ పర్యటనకు వెళ్లేముందు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి మరీ ఆయన వెళ్లారు. పర్యటనలో భాగంగా తిరువాడనైలోని ఓ బస్టాండు ప్రాంతాన్ని సందర్శించారు. ఇంతలో ఆయన వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి ఆయనకు ఎదురుతిరిగారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారంతా ఆయన్ను చుట్టుముట్టి గట్టిగా నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో 'ఇంకోసారి నియోజకవర్గంలో అడుగిపెడితే తిరిగి వెళ్లలేవు' అంటూ అక్కడి స్థానికులు ఎమ్మెల్యేను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications