అన్నాడీఎంకేలో చేరనున్న విజయశాంతి? ఈ భేటీలు అందుకేనా?
సినీనటి, ప్రస్తుత కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నాడీఎంకేలో చేరబోతున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
చెన్నై: సినీనటి, ప్రస్తుత కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నాడీఎంకేలో చేరబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారు ఆ పార్టీలోని శశికళ వర్గానికి చెందిన నాయకులు. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల రహస్యంగా రాత్రి సమయంలో జైలుకు వెళ్లి మరీ ఆ పార్టీ చీఫ్ శశికళను కలిసి వచ్చిన విజయశాంతి బుధవారం మళ్లీ చెన్నైలో అన్నాడీఎంకే డిప్యూటీ నేత టీటీవీ దినకరన్‌తో సమావేశం అయ్యారు.
విజయశాంతి వచ్చారనే సమాచారం తెలియగానే.. తనకు మద్దతు పలికేందుకు వచ్చిన ఎమ్మెల్యేలను పక్కనబెట్టి మరీ విజయశాంతికి ఎదురేగి స్వాగతం పలికారు దినకరన్. ఇద్దరి నడుమ భేటీ అనంతరం.. అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలను దినకరన్ చక్కదిద్దగలరన్న నమ్మకం తనకుందని ఎమ్మెల్యేలతో విజయశాంతి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

మరోవైపు టీటీవీ దినకరన్‌కు ఎమ్మెల్యేల మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. దినకరన్‌ను కలిసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బారులు తీరుతున్నారు. మంగళవారం 22 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలబడగా, బుధవారం సాయంత్రానికి ఈ సంఖ్య 32కు పెరిగింది.
తమకు మద్దతు పలికే ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరుకోనుందని, ఒకటీ రెండు రోజుల్లోనే తమ బలం చూడబోతున్నారంటూ శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే తంగతమిళ సెల్వన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి చూస్తే తమిళనాట రాజకీయం కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications