Cancer: మాజీ MPకి ఊహించని షాక్.. ఆ వ్యాఖ్యలే కొంపముంచాయి.. వందల కోట్లకు లీగల్ నోటీసులు
Navjot Singh Sidhu: ప్రస్తుత కాలంలో ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న వ్యాధి క్యాన్సర్. అభివృద్ది చెందిన వైద్య సదుపాయాలు, సాంకేతికత వల్ల కొందరు ఆ రోగాన్ని ఎదిరించి విజయం సాధించగలుగుతున్నారు. దాన్ని జయించిన తర్వాత పలువురు సెలబ్రిటీలు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇదే విధంగా తన భార్య విజయగాథను మీడియా ముందు షేర్ చేసిన నవజ్యోత్ సింగ్ సిధ్దూపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీం ఇండియా మాజీ బ్యాటర్ మరియు మాజీ MP నవజ్యోత్ సింగ్ సిద్ధూకు గట్టి షాక్ తగిలింది. తన భార్య నవజోత్ కౌర్ సిద్ధూ కఠినమైన ఆహార నియమాలను పాటించడంతో 40 రోజుల్లోనే స్టేజ్ 4 క్యాన్సర్‌ను జయించారంటూ చేసిన ప్రకటన విమర్శలకు ఆజ్యం పోసింది. తప్పుడు క్లెయిమ్‌లతో క్యాన్సర్ రోగులను తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ 850 కోట్ల మేరకు లీగల్ నోటీసు ఇచ్చింది.

అల్లోపతి మందులు తీసుకోకుండానే తన భార్య స్టేజ్ 4 క్యాన్సర్ నుంచి అద్భుతంగా కోలుకుందని సిద్ధూ చేసిన వాదనలు సందేహాస్పదంగా ఉన్నాయని సొసైటీ తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా క్యాన్సర్‌తో పేషెంట్స్‌కు ప్రమాదకరంగా పరిణమించవచ్చంటూ సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు అల్లోపతి చికిత్సను అపహాస్యం చేయడమే కాకుండా రోగుల జీవితాలను దుర్భరంగా మారుస్తాయన్నారు.
'అల్లోపతి మందులు లేకుండా కేవలం నిమ్మకాయ నీళ్లు, తులసి, పసుపు, వేప ఆకులు మరియు ఇతర ఆహారం తీసుకోవడం ద్వారానే క్యాన్సర్‌ను జయించారనే మీ భర్త వాదనలను సమర్ధిస్తారా' అని సొసైటీ తన లీగల్ నోటీసులో నవజ్యోత్ కౌర్‌ను ప్రశ్నించింది. సిద్ధూ వాదనలకు మద్ధతుగా ఆయన భార్య వైద్య చికిత్సకు సంబంధించిన పత్రాలను వారంలోపు సమర్పించాలని కోరింది. అంతేకాకుండా తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో 850 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications