షుగర్ వ్యాధి రావడానికి ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..!!
ప్రస్తుత కాలంలో షుగరు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. వయసు తో సంబంధం లేకుండా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. మారుతున్న జీవన శైలి.. ఒత్తిడి.. తగ్గుతున్న శారీరక శ్రమ కారణంగా షుగరు బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే, షుగరు ప్రారంభం సమయంలోనే శరీరం పలు సంకేతాల ను అందిస్తుంది. చాలామంది ఈ సూచనలను సంవత్సరాల పాటు పట్టించుకోకపోవ డం వల్ల తరువాత టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నట్లు గుర్తించారు. అయితే.. షుగరు ప్రారంభం సమయంలో కనిపించే సంకేతాలను నిపుణులు వివరిస్తున్నారు.
ప్రీ డయాబెటిక్ సమయంలో శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయులు అధికంగా ఉన్నప్పుడు మెడ, చేతి కింద భాగాలు లేదా తొడల దగ్గర చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ కనిపిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇవి సాధారణ చర్మ సమస్యలుగా కనిపించినా, వాస్తవానికి శరీరంలో హైపర్ ఇన్సులినీమియా ఉన్నట్లు సూచించే సంకేతాలుగా చెబుతున్నారు. రక్తంలో ఇన్సులిన్ మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల ఈ మార్పులు కనిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే మెడ చుట్టూ నల్లగా, వెల్వెట్‌లా కనిపించే చర్మపు మచ్చలను అకాంథోసిస్ నైగ్రికాన్స్‌గా పిలుస్తారు. అదే విధంగా రాత్రి 3 నుంచి 4 గంటల మధ్య అకస్మాత్తుగా మేల్కొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళనగా అనిపించడం వంటి లక్షణాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిల మార్పులతో సంబంధం ఉంటాయి. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్న సమయంలో తీవ్రమైన అలసట రావడం కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోవడం వల్ల అవుతుంది.

జీవనశైలిలో మార్పులతో నియంత్రణ
అదే విధంగా ఎక్కువగా వ్యాయామం చేసినా, తక్కువగా తిన్నా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గకపోవడం కూడా అధిక ఇన్సులిన్ ప్రభావమే అవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. చక్కెరను ఎక్కువగా తీసుకున్నప్పుడు మెదడులో డోపమైన్ పెరిగి తాత్కాలిక ఆనంద భావన కలుగుతుంది. తరువాత బ్లడ్ షుగర్ తగ్గిపోతే మళ్లీ తీపి పదార్థాల కోసం శరీరం కోరుకుంటుంది. జీవనశైలిలో మార్పులు కూడా మధుమేహం పెరగడానికి ప్రధాన కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తు న్నారు. టీతో పాటు బిస్కెట్లు తీసుకోవడం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అల్పాహారం, తగినంత ప్రోటీన్ లేకుండా భోజనం చేయడం, నిద్రలేమి, ఒత్తిడి, కూర్చునే జీవనశైలి, అధిక చక్కెర వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. భోజనం చేసిన వెంటనే నిద్రగా అనిపించడం, ఎప్పుడూ ఆకలిగా ఉండటం, సాయంత్రం అలసట, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గకపోవడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్యలుగా తీసుకుంటారు. అయితే ఇవి భవిష్యత్తులో మధుమేహానికి సంకేతాలు అవుతాయి. శరీరం ముందుగానే ఇచ్చే ఈ చిన్న సంకేతాలను గుర్తిస్తే, జీవనశైలిలో మార్పులు చేసి మధుమేహాన్ని ముందుగానే నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications