దోసకాయ, టమాటా రోటి పచ్చడి.. ఇలా చేస్తే అమోఘం!
ప్రతిరోజు మనం తినే ఆహారాలలో రోటి పచ్చళ్ళు మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఈరోజు మనం దోసకాయ టమాట రోటి పచ్చడి ఎలా చేస్తారో తెలుసుకుందాం. దోసకాయ, టమాటాలలో ఉండే పోషకాలతో ఈ రోటి పచ్చడి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ రోటి పచ్చడి సరైన విధానంలో చేసుకుని తింటే మనం రోజూ తినే అన్నం కంటే డబుల్ అన్నం తినేస్తాం.
దోసకాయ టమాటా రోటి పచ్చడి కి కావలసిన పదార్థాలు
టమాటాలు- పావుకిలో
దోసకాయ- ఒకటి
పచ్చిమిరపకాయలు- 20 కారాన్ని బట్టి
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రెండు స్పూన్లు రుచికి తగినంత
జీలకర్ర- రెండు టేబుల్ స్పూన్లు
వెల్లి పాయలు- 10 రెబ్బలు
చింతపండు- ఉసిరికాయంత
పోపు గింజలు- ఒక స్పూను
ఎండుమిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెమ్మలు
కొత్తిమీర- కొద్దిగా

దోసకాయ, టమాటా పచ్చడిని ఇలా చెయ్యండి
దోసకాయ, టమాటా పచ్చడి తయారీ కి ముందుగా టమాటాలను కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు తొడిమలు తీసుకోవాలి. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో మూడుస్పూన్ల నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయలు, చింతపండును అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనిచ్చి రోట్లో కానీ, మిక్సీలో కానీ పచ్చడిని నూరుకోవాలి.
దోసకాయ ఇలా కలిపితే సూపర్ టేస్ట్
టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు , వెల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు అన్నింటినీ మిక్సీ జార్ లో కానీ, రోట్లో కానీ వేసుకుని పచ్చడిగా నూరుకోవాలి. చివరగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి.
అన్నంలోకి ఈ పచ్చడి అద్భుతం
ఆపై స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టి అందులో ఒక స్పూను నూనె వేసి పోపు గింజలు వేసి, రెండు ఎండు మిరపకాయలను వేసి, కొద్దిగా కరివేపాకు వేసి పోపు చేసుకుని, ఈ పచ్చడిలో కలుపుకోవాలి. అంతే రుచికరమైన దోసకాయ టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.












Click it and Unblock the Notifications