గుడ్డులో పచ్చ సొన ఎవరికి మంచిది, ఎవరికి డేంజర్..!!
రోజూ గుడ్డు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. దీనిలో మాంసకృతులు, విటమిన్ డీ వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే రోజూ గుడ్డు తినడంపై అనేక అపోహలు, సంశయాలు కూడా ఉన్నాయి. గుడ్డులోని పచ్చసొన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుందని, బరువు పెంచుతుందని భావిస్తారు. అసలు గుడ్డులోని పచ్చసొన తినాలా వద్దా? గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యకరమా లేదా హానికరమా అనే సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
గుడ్డులో పచ్చసొన తినటంపైన కొందరిలో అపోహలు ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో గుండెకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో మంచి మొత్తంలో ప్రోటీన్‌తో పాటు గుడ్డు పచ్చసొనలో ఒమేగా-3 ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను అందిస్తాయి. గుడ్డులోని పచ్చసొనలో రిబోఫ్లేవిన్, విటమిన్లు, విటమిన్ బి-12 వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. గుడ్డు పచ్చసొనలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి, పనితీరుకు అవసరం. గుడ్డు సొనలు రోజంతా శక్తిని అందించగల అధిక-నాణ్యత ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి హెచ్‌డీఎల్ స్థాయిని పెంచుతాయి. అంటే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. బలమైన ఎముకలను ప్రోత్సహిస్తుంది. అదే విధంగా గుడ్డులోని పచ్చసొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ స్థితిస్థాపకతను పెంచి, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.

నిపుణుల సూచనలు
ఇదే సమయంలో వయసు రీత్యా, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రం గుడ్డు పచ్చ సొన తినటం వలన కొన్ని సమస్యలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుడ్డు పచ్చసొనలో డైటరీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. పచ్చసొన ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుడ్లకు ఎలర్జీ ఉన్నవారు పచ్చసొన తినడం వల్ల సమస్యలను ఎదురయ్యే అవకాశం ఉంది. పచ్చి లేదా తక్కువ ఉడికించిన గుడ్డు పచ్చసొనలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఇందులో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. పచ్చసొనను తీసుకోవడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీంతో.. పరిమితంగా తీసుకోవటం ద్వారా సమస్యలు రాకుండా ఆరోగ్య పరంగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications