తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు వీళ్లే.. !!
తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. వారి పేర్లను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. ఈ మేరకు అభ్యర్థుల తుది జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందా పార్టీ.
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సామా రామ్మోహన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ ఇద్దరు నాయకులకు క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, విద్యార్థి దశ నుంచి పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల నేపథ్యాన్ని పరిశీలించి వారిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు ఒక రకంగా ఇది రేవంత్ సర్కార్ కు పరీక్షగా నిలవనున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర పీసీసీ ముఖ్య నేతల అభిప్రాయాల ఆధారంగానే ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో పట్టణ ఓటర్లు, ఐటీ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక్కడ యువతలో మంచి గుర్తింపు ఉన్న సామ రామ్మోహన్ రెడ్డిని నిలబెట్టడం ద్వారా సానుకూల ఫలితాలు సాధించవచ్చని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉంది.
The AICC President, Shri Mallikarjun Kharge garu, has approved the following persons as party candidates for the forthcoming biennial elections to the Telangana Legislative Council from the Graduates' Constituencies: pic.twitter.com/sZqReooFtA
— Telangana Congress (@INCTelangana) September 29, 2026
ఉద్యమాలకు కేరాఫ్ అయిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో విద్యావంతుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభ్యర్థిత్వం పార్టీ గెలుపుకు దోహదపడుతుందని స్థానిక నేతలు అంచనా వేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుండటంతో పోటీ త్రిముఖంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, నిరుద్యోగ సమస్యలు, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ, విద్యా రంగానికి కేటాయింపులు వంటి అంశాలు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి.












Click it and Unblock the Notifications
