రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు! సైంటిస్టులు చెప్పిన సింపుల్ చిట్కా
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలు ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్నాయి. అయితే, ఎలాంటి ఖరీదైన మందులు లేకుండా మన ఆహారపు అలవాట్లలో చేసుకునే ఒక చిన్న మార్పుతో మానసిక ప్రశాంతతను పొందవచ్చని బ్రిటన్‌లోని న్యూకాసిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.
రోజూ తాగే ఒక్క గ్లాసు స్వచ్ఛమైన పండ్ల రసం లేదా ఫ్రూట్ స్మూతీ మీ శారీరక ఆరోగ్యానికే కాకుండా, మానసిక ఉత్తేజానికి కూడా అద్భుతంగా తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపించారు. 'బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్' ప్రచురించిన ఈ పరిశోధన వివరాలు ఇప్పుడు హెల్త్ కేర్ రంగంలో ఆసక్తికరంగా మారాయి.

నాలుగు వారాల ప్రయోగం.
తక్కువ పరిమాణంలో పండ్లు, కూరగాయలు తీసుకునే కొంతమంది వ్యక్తులపై పరిశోధకులు నాలుగు వారాల పాటు ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిని మూడు గ్రూపులుగా విభజించి వారి ఆహార నియమాలను గమనించారు.
క్రమం తప్పకుండా రోజూ ఒక గ్లాసు 100 శాతం నేచురల్ ఫ్రూట్ జ్యూస్, స్మూతీ తీసుకున్న అభ్యర్థుల్లో మానసిక ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు సైంటిస్టులు గుర్తించారు. సాధారణ ఆహారం తీసుకున్న వారితో పోలిస్తే, పండ్ల రసాలు తాగిన వారి మెంటల్ హెల్త్ స్కోర్‌లో 2.52 పాయింట్ల సానుకూల వ్యత్యాసం నమోదైంది.
షుగర్ భయాలు అబద్ధమే!
సాధారణంగా పండ్ల రసాల్లో ఉండే న్యాచురల్ షుగర్ వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. కానీ, సరైన పరిమాణంలో పండ్ల రసం తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియలకు ఎలాంటి హానీ కలగలేదని, పైగా ఫైబర్ శాతంతో పాటు మెదడుకు రక్తం సరఫరా కూడా మెరుగైనట్లు డాక్టర్ ఆలివర్ షానన్ నేతృత్వంలోని బృందం స్పష్టం చేసింది. సిట్రస్ జాతి పండ్ల రసాలు తాగడం వల్ల ప్లావనోయిడ్లు శరీరంలోకి చేరి మెదడు కణాలను చురుగ్గా ఉంచుతాయని వారు వివరించారు.
ఖర్చు తక్కువ.. ఆరోగ్యం ఎక్కువ
తాజా పండ్లు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, రోజూ కావలసిన పోషకాలను తక్కువ ఖర్చులో పొందేందుకు పండ్ల రసం సరైన ప్రత్యామ్నాయమని పరిశోధకురాలు డాక్టర్ కోర్ట్నీ నీల్ పేర్కొన్నారు.
శరీరానికి అవసరమైన విటమిన్లు అందడమే కాకుండా, మనస్సును ప్రశాంతంగా ఉంచేలా ఈ చిరు మార్పు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాబట్టి, రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు పండ్ల రసాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా డిప్రెషన్ లాంటి రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.














Click it and Unblock the Notifications