48 ఏళ్ల క్రితం ఇదే రోజు పేరు మార్చుకున్నాను.. చిరంజీవి ఎమోషనల్ పోస్టు వైరల్
కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు.. మహా పురుషులవుతారు అనే పదాలకు మెగాస్టార్ చిరంజీవి నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అనే మహావృక్షంగా మారారు. ఒక సామాన్య యువకుడిగా ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ ఐదు దశాబ్దాలకు చేరువైంది. తన నటన, డాన్స్ తో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న చిరంజీవి తాజాగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన 'ప్రాణం ఖరీదు' అనే చిత్రంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం నేటితో 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేసిన భావోద్వేగ సందేశం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
" 22 సెప్టెంబర్ 1978.. ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది.. మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది. మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరోజు చిరంజీవి అనేది నేను పెట్టుకున్న పేరు. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు. మీ ప్రేమకు, అభిమానానికి.. ఎప్పటికీ కృతజ్ఞతలతో.. మీ చిరంజీవి అని ఎక్స్ వేదికగా ఆయన ఎమోషనల్ పోస్టు పెట్టారు.
అలాగే తన సినీ ప్రస్థానంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 'మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్' లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా.. తనపై, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారాలు, నిందలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. దశాబ్దాలుగా ఎంతో పవిత్రంగా, నిస్వార్థంగా నడిపిస్తున్న బ్లడ్ బ్యాంక్ లో రక్తాన్ని అమ్ముకుంటున్నారంటూ కొంతమంది చేస్తున్న దారుణమైన ఆరోపణలు పూర్తిగా మూర్ఖత్వంతో కూడుకున్నవని ఆయన కొట్టిపారేశారు.

సినిమాల్లో తాను తీసుకునే భారీ పారితోషికంతో సమానమైన మొత్తాన్ని రక్తం విక్రయించడం ద్వారా సంపాదించాలంటే.. అసలు ఎన్ని కోట్ల రక్తం ప్యాకెట్లను విక్రయించాల్సి ఉంటుందో విమర్శలు చేసేవారికి కనీస ఆలోచన ఉందా..? అని చిరంజీవి ఘాటుగా ప్రశ్నించారు. ఎవరి వద్ద నుంచి ఎలాంటి డొనేషన్లు స్వీకరించకుండా, కేవలం తన సొంత కష్టార్జితంతోనే ఈ సేవా సంస్థను స్థాపించి నడుపుతున్నానని స్పష్టం చేశారు. రక్తదానం అనే పవిత్ర ప్రక్రియ ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్న వేళ, ఇటువంటి పనికిమాలిన వ్యాఖ్యలను తాను ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వనని, ధర్మమే తనను కాపాడుతుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
