ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! 9 లక్షల మందికి అకౌంట్లోనూ, నగదుగానూ..!
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం (NTR Bharosa Pension) కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ వృత్తుల అర్హులకు ఇస్తున్న పెన్షన్లలో ఈసారి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 62 లక్షల మంది లబ్దిదారుల్లో 9.34 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద ఈ మార్పులు జరుగుతాయి. మిగిలిన వారికి ఎప్పటిలాగే చేతికి నగదు అందిస్తారు. వీరికి మాత్రం కొంత మొత్తం కేంద్రం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. మిగిలిన మొత్తం రాష్ట్రం ఉద్యోగులతో పంపిణీ చేయిస్తుంది.
రాష్ట్రంలోని 62 లక్షల మంది పింఛనుదారుల్లో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) పరిధిలోకి వచ్చే 9.34 లక్షల మంది లబ్ధిదారులకు కేంద్రం రూ.382.82 కోట్లు కేటాయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం, ఈ నిధులను 'SNA-SPARSH' విధానంలో నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ 1 నుంచే జమ చేస్తారని తెలిపారు. కేంద్ర వాటా బ్యాంకు ఖాతాల్లో జమైనప్పటికీ, లబ్ధిదారులకు అందే మొత్తం పింఛనులో ఎలాంటి మార్పు ఉండదని, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను 'స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు' సిబ్బంది ద్వారా ఎప్పటిలాగే ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ కొత్త నిబంధన కేవలం NSAP పరిధిలోని 9.34 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన సుమారు 53 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు పూర్తి మొత్తాన్ని యథావిధిగా ఇంటి వద్దే నగదు రూపంలో అందిస్తారని మంత్రి తెలిపారు.
ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను (IGNOAPS) ప్రకారం 60-79 ఏళ్ల మధ్య పింఛన్ దారులకు కేంద్ర వాటా (బ్యాంకులో) రు. 200 పడనుంగా.. రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రు.3,800 కలిపి మొత్తం 4 వేలు అందుతాయి. అలాగే 80 ఏళ్ దాటిన వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రు.500 + రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రు.3,500 కలిపి మొత్తం 4 వేలు అందుతాయి.
అలాగే ఇందిరా గాంధీ జాతీయ వితంతు పింఛను (IGNWPS) పథకం కింద 40-79 ఏళ్ల మధ్య ఉన్న వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రు.300 + రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రు.3,700 కలిపి మొత్తం 4వేలు అందుతాయి. 80 ఏళ్లు దాటిన వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రు.500 + రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రు.3,500 కలిపి 4 వేలు లభిస్తాయి.

అలాగే ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పింఛను (IGNDPS) పథకం కింద 18-79 ఏళ్ల మధ్య ఉన్న వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రు.300 + రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రు. 5,700 కలిపి 6 వేలు అందుతాయి. 80 ఏళ్లు దాటిన వారికి కేంద్ర వాటా (బ్యాంకులో) రు.500 + రాష్ట్ర వాటా (ఇంటి వద్ద నగదు) రు. 5,500 కలిపి మొత్తం పింఛను 6 వేలు అందుతుంది. కేంద్ర ప్రభుత్వ వాటా సజావుగా జమ కావడానికి 9.34 లక్షల మంది NSAP పింఛనుదారులు తమ ఆధార్ అనుసంధానిత బ్యాంకు పొదుపు ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని మంత్రి కోరారు. పింఛను మొత్తం బ్యాంకులో జమైన వెంటనే లబ్ధిదారులకు వ్యక్తిగత సమాచారంతో పాటు ప్రతి నెలా మెసేజ్ రూపంలో సమాచారం అందిస్తామన్నారు. ఖాతాల యాక్టివేషన్, ఆధార్ అనుసంధానం లేదా చెల్లింపులపై ఎలాంటి సందేహాలున్నా సమీపంలోని స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సచివాలయాలను సంప్రదించాలని మంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications
