కొర్రల కట్టె పొంగలి: బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ పేషెంట్లకు సూపర్!
ఇప్పుడు అందరూ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. బియ్యం బదులు మిల్లెట్స్ వాడటం పెరిగింది. అందులో కొర్రలు చాలా హెల్తీ. వీటితో చేసే కట్టె పొంగలి నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఆప్షన్. కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుతాయి. ప్రోటీన్ కూడా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే ప్రయత్నం చేసేవారికి సూపర్.
కావాల్సిన పదార్థాలు:
కొర్రలు - 1 కప్పు (రాత్రంతా నానబెట్టినవి)
పెసరపప్పు - అర కప్పు
నీళ్లు - 4 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - పిడికెడు
పచ్చిమిరపకాయలు - 3 (నిలువుగా చీల్చినవి)
అల్లం - 1 ఇంచ్ తరుగు
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - 2 చిటికెళ్లు

తయారీ విధానం:
ముందుగా పెసరపప్పును నూనె లేకుండా లో ఫ్లేమ్‌పై 10-15 నిమిషాలు ఎర్రగా వేయించాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించి నీటితో కడిగి కుక్కర్‌లో వేయాలి. కొర్రలను తప్పనిసరిగా రాత్రంతా నానబెట్టాలి. రెండు మూడు గంటలు నానబెడితే పొంగలి గట్టిగా ఉంటుంది. క్రీమీగా రావాలంటే రాత్రంతా నానబెట్టడం ముఖ్యం. కుక్కర్‌లో వేయించిన పెసరపప్పు, నానిన కొర్రలు, ఉప్పు వేసి 4 కప్పుల నీళ్లు పోయాలి.
మీడియం ఫ్లేమ్‌పై 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. హై ఫ్లేమ్‌పై పెట్టకూడదు. ఆవిరి పోయాక మెదిపితే చల్లారేకొద్దీ చిక్కగా వస్తుంది. తర్వాత తాలింపు తయారు చేయాలి. నెయ్యి వేడి చేసి జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి సువాసన వచ్చేలా వేయించి పొంగలిలో కలపాలి.
వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా రాత్రి లైట్ డిన్నర్‌గా తీసుకోవచ్చు. కడుపు తేలికగా, హాయిగా అనిపిస్తుంది. కొర్రల పొంగలి కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. వారంలో రెండు మూడు రోజులు బియ్యం బదులు దీన్ని తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. షుగర్ పేషెంట్లు కూడా నిబంధనలు పాటిస్తూ తీసుకోవచ్చు.













Click it and Unblock the Notifications
