జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!!
మధుమేహంతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా షుగరు బాధితులు పెరుగుతున్నారు. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు వివిధ ఇంటి చిట్కాలను పాటిస్తారు. జీలకర్ర, మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టి తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే, రక్తంలో చక్కెరను త్వరగా తగ్గించడానికి మెంతుల నీరు మంచిదా లేదా జీలకర్ర నీరు మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంది. దీని పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
జీరా వాటర్ రక్తంలో చక్కెర నియంత్రణలో పలు ప్రయోజనాలు అందిస్తుంది. జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది బరువు తగ్గడంలో, అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగవుతుంది, తద్వారా పరోక్షంగా చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదయం గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. జీలకర్రలో ఉన్న యాంటీ డయాబెటిక్ లక్షణాలు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c స్థాయిలను గణనీయంగా తగ్గించాయి. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగించగలుగుతుంది. అదేవిధంగా జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రెండింటితో ప్రయోజనాలు.. నిపుణుల సూచనలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం, మధుమేహ బాధితులకు మెంతులు నిజంగా ఒక వరం, ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక చెంచా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం, మెంతులను నమలడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. ఇది ముఖ్యంగా టైప్-2 మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరం. ఇది గట్ (జీర్ణవ్యవస్థ)లో జెల్ లాంటి పదార్థంగా మారి గ్లూకోజ్ శోషణను నెమ్మదిగా చేస్తుంది. ట్రైగ్లిసరైడ్స్, LDL, టోటల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ను మెరుగుపరచడంలో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా తగ్గించుకోవాలను కునే వారికి మెంతుల నీరు ఉత్తమం. జీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునేవారు జీలకర్ర నీటిని ఎంచుకోవచ్చు. మీ శరీర స్వభావాన్ని బట్టి, వైద్యుడి సలహాతో ఈ రెండింటినీ తీసుకోవచ్చు. జీవనశైలిలో మార్పులు.. ఆరోగ్య కరమైన ఆహారంతో వైద్యుడి సూచనల మేరకు నడుచుకోవటం ద్వారా షుగరును నియంత్రణలో ఉంచుకోవచ్చు.












Click it and Unblock the Notifications