రుచికరమైన కొబ్బరి అన్నం.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు!
దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ వంటకాలలో కొబ్బరి అన్నం ఒకటి. దీనిని తమిళనాడులో 'తేంగై సాదం' అని, ఉత్తరాదిలో 'నారియల్ చావల్' అని పిలుస్తారు. పండగలు, శుభకార్యాల సమయంలో దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి లేదా లంచ్ బాక్స్‌లోకి త్వరగా ఏదైనా రుచికరమైన వంటకం చేయాలనుకున్నప్పుడు కొబ్బరి అన్నం పర్ఫెక్ట్ ఛాయిస్. . కేవలం కొద్ది నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీ విధానం చూద్దాం.
కావలసిన పదార్థాలు:
వండిన అన్నం (పొడిపొడిగా ఉన్నది) – 2 కప్పులు
పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు
నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – 1 టీస్పూన్
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్
పల్లీలు (వేరుశనగ గుళ్ళు) – 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు ముక్కలు – 10 (ఐచ్ఛికం)
పచ్చిమిర్చి – 3 (పొడవుగా కట్ చేసినవి)
ఎండుమిర్చి – 2
అల్లం తురుము – 1 టీస్పూన్
కరివేపాకు – రెండు రెమ్మలు
ఇంగువ – పావు టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం:
కొబ్బరి అన్నం పర్ఫెక్ట్‌గా రావాలంటే అన్నం పొడిపొడిగా ఉండాలి. అన్నం వండిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి చల్లార్చుకోవాలి. మిగిలిపోయిన రాత్రి అన్నంతో కూడా ఈ రెసిపీని చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం తయారీకి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వాడితే కొబ్బరి అన్నం మరింత కమ్మటి సువాసనతో వస్తుంది.
కొబ్బరి అన్నంలో ఇది వేస్తేనే సంప్రాదాయ రుచి
నూనె వేడెక్కాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి కాస్త రంగు మారే వరకు వేయించాలి. ఆ తర్వాత పల్లీలు, జీడిపప్పు ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగాక అందులో కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం తురుము మరియు కరివేపాకు వేసి వేయించాలి. ఈ సమయంలోనే పావు చెంచా ఇంగువ చేర్చాలి. ఇంగువ వేయడం వల్ల కొబ్బరి అన్నానికి మంచి సాంప్రదాయ రుచి వస్తుంది.
కొబ్బరి రంగు మారకుండా చేస్తేనే రుచి
ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి సిమ్‌లో పెట్టి, ఫ్రెష్‌గా తురుముకున్న పచ్చి కొబ్బరిని పాన్ లో వేయాలి. కొబ్బరిని ఎక్కువ సేపు వేయించకూడదు, కేవలం ఒకటి లేదా రెండు నిమిషాల పాటు తడి పోయేలా లైట్‌గా వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి రంగు మారకుండా చూసుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి, ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేయాలి.
ఇలా చేస్తే నోరూరించే కొబ్బరి అన్నం సిద్ధం
పోపు మరియు కొబ్బరి తురుము అన్నానికి బాగా పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. అన్నం ముద్దగా కాకుండా, విరిగిపోకుండా జాగ్రత్తగా కలపాలి. అంతా కలిశాక తక్కువ మంటపై ఒక నిమిషం పాటు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో కమ్మగా, నోరూరించే హెల్దీ కొబ్బరి అన్నం సిద్ధం. దీనిని ఎలాంటి కూరలు లేకుండా విడిగా తిన్నా లేక ఆలుగడ్డ ఫ్రైతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.













Click it and Unblock the Notifications