వామాకు పచ్చడి: పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చితో ఇలా చేస్తే అద్భుతమే!
వామాకు మన ఇళ్లలో సాధారణంగా పెంచుకునే మొక్క. దీని ఆకులతో సాధారణంగా చాలా మంది బజ్జీలు చేసుకుంటారు. కానీ వామాకుతో చేసే పచ్చడి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దగ్గు, జలుబు, అజీర్ణం వంటి సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. వేడి అన్నం, ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి టిఫిన్లతో కలిపి తింటే రుచి మరింత బాగుంటుంది.
కావలసిన పదార్థాలు:
వామాకు ఆకులు - 30 ఆకులు
పల్లీలు - 1 టేబుల్ స్పూన్
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టీ స్పూన్
శనగపప్పు - 1 టీ స్పూన్
మినప్పప్పు - 1 టీ స్పూన్
పచ్చిమిర్చి - 10-15 (కారానికి తగ్గట్టు)
వెల్లుల్లి రెబ్బలు - 5-6
చింతపండు - చిన్న ముక్క
పసుపు - పావు టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు -5
పోపుకు: ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ

తయారీ విధానం:
ముందుగా వామాకును నీళ్లలో బాగా కడగాలి. ఆపై స్టవ్ వెలిగించి పాన్‌లో కొద్దిగా నూనె వేసి పల్లీలు, ధనియాలు, నువ్వులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే పాన్‌లో శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించి, పచ్చిమిర్చి కూడా రంగు మారేలా ఫ్రై చేయండి. ఇప్పుడు వామాకు ఆకులను పాన్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌పై మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించండి. ఆపై ఈ అన్నింటిని చల్లారనివ్వండి.
ఇలా చేస్తే వామాకు పచ్చడి బాగుంటుంది
మిక్సీలో వేయించిన పప్పులు, నువ్వులు, వెల్లుల్లి, చింతపండు, పసుపు వేసి పొడిలా వేయండి. తర్వాత మగ్గించిన వామాకు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేయండి. అదనపు నీరు అవసరం లేదు. చివరగా పోపు తయారు చేసి పచ్చడిలో కలపండి. ఆవాలు, జీలకర్ర, పప్పులు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి వేడి పోపు వేస్తే సువాసన బాగా వస్తుంది.
వామాకు పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు
వామాకులో యాంటీసెప్టిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచి అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. రోజూ కొద్దిగా తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంట్లో తాజా వామాకు ఆకులతో ఈ పచ్చడి తయారు చేసి చూడండి. మీరు వదిలిపెట్టకుండా తింటారు నమ్మండి.













Click it and Unblock the Notifications
