చేమ దుంపల పులుసు.. ఇలా చేస్తే వాసనకే కడుపు నిండుతుంది!
మనం నిత్యం ఎన్నో రకాల వంటలు చేస్తాం. అటువంటి వంటకాలలో పులుసులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక పులుసులలో చేమ దుంపల పులుసు సరైన విధానంలో చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. నోటికి రుచికరంగా ఉండే, సూపర్ టేస్ట్ ఉండే చేమ దుంపల పులుసు మనం సింపుల్ గా కూడా చెయ్యొచ్చు. ప్రస్తుతం మనం చేమ దుంపల పులుసు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.
తయారీకి కావాల్సిన పదార్థాలు
చేమ దుంపలు : 1/4 కేజీ ( ఉడికించి తొక్క తీసి కట్ చేసుకున్న ముక్కలు )
ఉల్లిపాయలు: 2 కట్ చేసి పెట్టుకున్నవి
పచ్చి మిర్చి : 4 కట్ చేసుకున్నవి
చింతపండు: నిమ్మకాయ అంత
ఉప్పు : ఒకటిన్నర స్పూన్
కారం : ఒకటిన్నర స్పూన్
పసుపు : పావు స్పూన్
పోపు గింజలు : ఒక స్పూన్
జీలకర్ర మెంతుల పొడి : అర స్పూన్
ధనియాల పొడి : ఒక స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
నూనె : 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెండు స్పూన్స్ నూనె వేసిన తర్వాత అందులో పోపు గింజలు వేసి వేయించాలి. తర్వాత అందులో కరివేపాకు వేసి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలపాలి. కాస్త మగ్గిన తర్వాత అందులో చేమ దుంపల ముక్కలు వేసి అందులో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి.
ఆపై అందులో నీళ్లలో నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసి బాగా కలిపి మసలనివ్వాలి. ఆపై అందులో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి పులుసు మనకు కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. అంతే రుచికరమైన చేమదుంపల పులుసు రెడీ అవుతుంది. ఈ పులుసు అన్నం, చపాతీ దేనిలోనైనా తింటే బాగుంటుంది. కొందరు పచ్చివి పొట్టు తీసి కూడా పులుసు పెడతారు. కానీ ఉడికించి ముక్కలు కట్ చేసిన తర్వాత చేసిన పులుసు చాలా బాగుంటుంది.













Click it and Unblock the Notifications
