ఏపీలో స్థానిక ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ల వాడకంపై ఎస్ఈసీ క్లారిటీ..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే క్షేత్రస్దాయిలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ జిల్లా స్ధాయిలో కలెక్టర్ లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, పంచాయితీరాజ్, మునిసిపల్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ (AP SEC) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎన్నికల సన్నద్దతపై వారిని ఆరా తీయడంతో పాటు పలు సూచనలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠ.. వివరాలు వెల్లడించారు. గత రెండు నెలల నుంచీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు అధికారులు అందరూ రెడీగా ఉన్నట్లు పునేఠ తెలిపారు.అయితే బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తర్వాత ఎలక్షన్ల నిర్వహణకు సిద్ధం గా ఉన్నామని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను దశల వారీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. 05-02-2026 వరకూ ఉన్న ఫోటో ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం బ్యాలెట్ బాక్సులు, పేపర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బ్యాలెట్ ప్రింటింగ్ కు ప్రింటింగ్ ప్రెస్ ను త్వరలో ఫైనల్ చేస్తామని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలు వాడాలని భావించినా, తగినన్ని అందుబాటులో లేకపోవడం వల్ల బ్యాలెట్ పేపర్లను వాడాలని నిర్ణయించారు. దీంతో ఫలితాలు కాస్త ఆలస్యమవుతాయని భావిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం మిగిలిన ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు చేస్తోంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా ఆ మేరకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
