AP Local Body Elections: స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఆలస్యంపై ఈసీ క్లారిటీ..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొంతకాలంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే వివిధ స్థానిక సంస్థలపై కోర్టుల్లో ఉన్న వివాదాలు, ఇతరత్రా కారణాల వల్ల ఎన్నికలు రెండు నెలలు ఆలస్యం కావచ్చని ఎన్నికల సంఘం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే నెలలో కచ్చితంగా స్థానిక ఎన్నికలు జరుగుతాయని ఆశలు పెట్టుకున్న వారంతా నిరాశకు గురవుతున్నారు. ఈ వార్తలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (APSEC) ఇవాళ ఎన్నికల వాయిదాపై స్పష్టత ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియా, ఇతర కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం అవుతున్న సమాచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో స్ధానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి మరో రెండు నెలలు సమయం పడుతుందని, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లకు సంబంధించిన కోర్టు కేసుల్లో క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోందని కమిషన్ తెలిపింది. ఎన్నికలు ఆలస్యమైనా వాటి నిర్వహణకు అంతర్గత ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కూడా ప్రచారం జరుగుతున్నట్లు పేర్కొంది.

అయితే ఈ సమాచారం పూర్తిగా తప్పుడు, అధికారికంగా ధృవీకరించని సమాచారం అని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, ఇతర భాగస్వాములు ఇలాంటి సమాచారాన్ని నమ్మడం, ఆధారపడటం లేదా ప్రచారం చేయవద్దని సూచించింది. కమిషన్ పేరుతో తప్పుడు, తప్పుదోవ పట్టించే లేదా అనధికారిక సమాచారాన్ని ప్రచారం చేస్తే వర్తించే చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన ఏదైనా అధికారిక ప్రకటనను ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా అధికారిక ప్రెస్ రిలీజ్ ద్వారా మాత్రమే చేస్తామని APSEC తెలిపింది. కమిషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక కమ్యూనికేషన్ మార్గాల్లో ధృవీకరించిన తర్వాతే నమ్మాలని సూచించింది.
మరోవైపు రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పథకాల పంపిణీ, స్ధానిక సమీకరణాలపై ఫోకస్ పెట్టింది. ముందుగా పట్టణ స్ధానిక సంస్ధల ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ స్ధానిక సంస్ధల ఎన్నికలను పూర్తి చేసి ఆర్ధిక సంఘం నుంచి రావాల్సిన నిధులు మురిగిపోకుండా చూసుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల వాయిదా ప్రచారంతో కూటమి శ్రేణులు నిరాశపడుతున్నాయి. ఇప్పుడు ఎస్ఈసీ ప్రకటనతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడనుంది.












Click it and Unblock the Notifications
