Nobel Literature Prize 2026: కెనడా రచయిత్రికి నోబెల్ సాహిత్య పురస్కారం..!
ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను వరుసగా ప్రకటిస్తున్న రాయల్ స్వీడిష్ అకాడమీ.. ఇవాళ సాహిత్య రంగంలో అవార్డును (Nobel Literature Prize 2026) ప్రకటించింది. కెనడాకు చెందిన రచయిత్రి, కవయిత్రి కూడా అయిన 76 ఏళ్ల ఆన్ కార్సన్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. సమకాలీన కవిత్వం, గద్య రచనలలో అత్యంత విశిష్టమైన రచయిత్రిగా పేరున్న కార్సన్ కు ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో రాయల్ స్వీడిష్ అకాడమీ కీలక ప్రకటన చేసింది.
ఈ అవార్డు ప్రకటన సమయంలో కార్సన్ ఐస్‌లాండ్‌లో ఉన్నారు. దీంతో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించినట్లు నోబెల్ కమిటీ ఫోన్ చేసి చెప్పింది. ఈ పురస్కారం అందుకున్న ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. తాను ఐస్‌లాండ్‌లో గాలి శబ్దాన్ని వింటూ ఉన్నానని కార్సన్ తెలిపారు. కవిత్వం, గద్యం, ప్రాచీన సాహిత్యం, అనువాదం వంటి వివిధ ప్రక్రియల మధ్య సంచరించే తన రచనలకు కార్సన్ ప్రసిద్ధి చెందారు. ఆమె రచనలు సమకాలీన ఇతివృత్తాలను అన్వేషిస్తూనే, తరచుగా ప్రాచీన గ్రీకు సాహిత్యం నుండి ప్రేరణ పొందుతాయి.

అనే కార్సన్ అత్యంత ప్రసిద్ధ రచనలలో 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్', 'ది బ్యూటీ ఆఫ్ ది హస్బెండ్, 'రాంగ్ నార్మా' ఉన్నాయి. ఆమె సాఫో, యూరిపిడిస్ రచనలతో సహా ప్రాచీన గ్రీకు రచనలను కూడా అనువదించారు. కార్సన్ తన వృత్తి జీవితంలో అనేక ప్రధాన సాహిత్య పురస్కారాలను అందుకున్నారు. మెక్‌గిల్, ప్రిన్స్‌టన్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ వంటి విశ్వవిద్యాలయాలలో క్లాసిక్స్, సాహిత్యాన్ని బోధించారు. కార్సన్ తన అత్యంత ముఖ్యమైన కొన్ని రచనలను 1990వ దశకంలో రచించారు. ఈ కాలం అంతర్జాతీయ సాహిత్య ప్రపంచంలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించింది. ఆ దశాబ్దంలోని కార్సన్ రచనలలో 'ది గ్లాస్ ఎస్సే' ఒకటి. ఇది 1995లో 'గ్లాస్, ఐరనీ, అండ్ గాడ్' సంకలనంలో ప్రచురించారు. ఈ రచన.. ప్రక్రియల మధ్య సరిహద్దులను చెరిపివేయడంలో, విభిన్న రచనా రూపాల మధ్య స్వేచ్ఛగా సంచరించగల ఆమె సామర్థ్యానికి అద్దం పట్టింది.














Click it and Unblock the Notifications
