
ఐటీ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్-రైజింగ్‌లో జాబ్ మార్కెట్-భారీ హైక్స్‌తో ఉద్యోగాలు
కోవిడ్ కారణంగా విద్య,వ్యాపారం.. ఇలా ఒక్కటేమిటి చాలా రంగాలే దెబ్బతిన్నాయి. చిన్న,మధ్య తరహా పరిశ్రమలు,కంపెనీలు మూతపడటంతో చాలామంది ఉద్యోగ,ఉపాధి కోల్పోయారు. దాదాపు ఏడాదిన్నరగా ఎంతోమంది ఉద్యోగాలు లేక దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. అయితే నిరుద్యోగులు,వృత్తి నిపుణుల్లో ఆశలు రేకెత్తించేలా ఇప్పుడిప్పుడే జాబ్ మార్కెట్ మళ్లీ గాడినపడుతోంది.
చాలా కంపెనీలు మళ్లీ నియామకాలపై దృష్టి సారిస్తున్నట్లు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఇండియన్ జాబ్ మార్కెట్లో ఐటీ నిపుణులకు 400 శాతం డిమాండ్ పెరిగినట్లు తెలిపింది. కేవలం ఐటీ సెక్టార్లో మాత్రమే కాదు ఇతర స్కిల్స్‌కు సంబంధించిన జాబ్స్‌కు కూడా డిమాండ్ పెరిగింది. కేవలం నియామకాల్లో మాత్రమే కాదు ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్న వేతనాల్లోనూ భారీ వృద్ది రేటు కనిపిస్తోందని తెలిపింది.

ఫుల్ టైమ్ ఇంజనీర్లకు ఆయా కంపెనీలు 70శాతం నుంచి 120శాతం హైక్ ఇస్తున్నాయని సర్వే వెల్లడించింది.గతేడాది ఇది కేవలం 20 నుంచి 30శాతం ఉండగా ఇప్పుడు అంతకు మూడు,నాలుగు రెట్లకు పెరగడం గమనార్హం.
ఇటీవలే దేశీ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 'రీబిగిన్' పేరిట మహిళా నిపుణుల రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది.ఎవరైతే వ్యక్తిగత కారణాలతో కెరీర్‌కు దూరమయ్యారో వారికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. కనీసం రెండేళ్ల పాటు మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా ఐటీ రంగంలో పనిచేసిన మహిళలు 'రీబిగిన్' ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకునేందుకు అర్హులని వెల్లడించింది. ఔత్సాహిక అభ్యర్థులు ఫుల్ టైమ్ డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలని తెలిపింది.
'ప్రతిభ కలిగినవారు... ఎవరైతే తమ స్కిల్స్‌తో ప్రపంచాన్ని మార్చగలమని విశ్వసించేవారిని టీసీఎస్ ప్రోత్సహిస్తుంది. మీరూ అందులో ఒకరైతే... ఔత్సాహికులైన ప్రతిభావంతులను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం.ప్రతిభ,సామర్థ్యం మనలో ఎప్పుడూ ఉంటాయి. రీబిగిన్తో ఆ ప్రతిభను మరోసారి చాటుకునే అవకాశం కల్పిస్తున్నాం.' అని టీసీఎస్ పేర్కొంది.ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే... టీసీఎస్ టెక్ కంపెనీ కాబట్టి ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి సాఫ్ట్వేర్ పట్ల మంచి పట్టు ఉన్నవారు అప్లై చేసుకుంటే మంచి కెరీర్ దొరుకుతుంది.
టీసీఎస్ మాత్రమే కాదు ఇన్ఫోసిస్,విప్రో తదితర ఐటీ కంపెనీలు భారీ ఎత్తున రిక్రూట్మెంట్స్ జరుపుతున్నాయి. ఈ లెక్కన 2021-22 సంవత్సరానికి ఐటీ రంగంలో మొత్తం వేతనాలు 1.7బిలియన్ డాలర్లకు చేరవచ్చునని చెబుతున్నారు. కంపెనీలు రిక్రూట్మెంట్లకు మొగ్గుచూపుతుండటంతో ఫ్రెషర్స్,ప్రొఫెషనల్స్‌కు ఇది మంచి సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కావాలనుకుని... తగిన స్కిల్స్ ఉన్నవారికి ఇది మంచి తరుణమని అంటున్నారు.బెంగళూరు,హైదరాబాద్,చెన్నైల్లోని ఐటీ కంపెనీలు రిక్రూట్మెంట్ డ్రైవ్స్ చేపడుతుండటంతో జాబ్ మార్కెట్ వేగంగా పుంజుకుంటోందని చెబుతున్నారు.