వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?
మన సంస్కృతిలో వంటగదికి విశిష్ట స్థానం ఉంది. దీనిని వంట చేసుకునే స్థలంగానే చూడరు. సాక్షాత్ అన్నపూర్ణా దేవి కొలువై ఉండే ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఇళ్లలో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండటానికి వంటగది రూపకల్పన, అక్కడ ఉపయోగించే వస్తువుల అమరికలోనూ కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఆగ్నేయ దిశలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికీ అనేక కారణాలు ఉన్నాయి.
ప్రస్తుత ఆధునిక కాలంలో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ప్రజల అవసరాలు, సమయాభావానికి అనుగుణంగా వంటగది రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే గృహిణుల సౌకర్యార్థం రకరకాల డిజైన్లు, ఎక్కువ బర్నర్లు కలిగిన గ్యాస్ స్టవ్‌లు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఇళ్ళలో వేగంగా వంట పూర్తి చేయడానికి రెండు బర్నర్ల కంటే 3-బర్నర్ లేదా 4-బర్నర్ గ్యాస్ పొయ్యిలను కొనుగోలు చేస్తోన్నారు గృహిణులు.

ఇక్కడే చాలా మందికి ఓ సందేహం ఎదురవుతోంది. సాధారణంగా మూడు అనే అంకెను కొన్ని సందర్భాల్లో అశుభంగా భావిస్తుంటారు. వంటగదిలో 3- బర్నర్ల గ్యాస్ స్టవ్ వాడటం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ స్టవ్‌కు ఇన్ని బర్నర్లు మాత్రమే ఉండాలనే కచ్చితమైన నియమం అంటూ ప్రత్యేకంగా ఏదీ శాస్త్రంలో ఎక్కడా లేదు.
కుటుంబ అవసరాలు, సౌకర్యాన్ని బట్టి మూడు లేదా అంతకంటే ఎక్కువ బర్నర్లు ఉన్న స్టవ్ ను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చని, దీనివల్ల ఎలాంటి వాస్తు దోషాలు కలగవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిజానికి మన సనాతన సంస్కృతిలో మూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా కొలుస్తారు.
అటు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడు సంఖ్యకు అధిపతి దేవగురువు బృహస్పతి. జ్ఞానానికి, శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహ ప్రభావం ఈ సంఖ్యపై ఉండటం వల్ల దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో మూడు బర్నర్ల గ్యాస్ పొయ్యిని కలిగి ఉండటం శుభప్రదంగా పరిగణించాలని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
బర్నర్ల సంఖ్య కంటే కూడా ఆ గ్యాస్ స్టవ్‌ను వంటగదిలో ఏ దిశలో ఉంచుతున్నామనేదే ముఖ్యం. వాస్తు నియమాల ప్రకారం వంటగదిలో పొయ్యిని ఉంచడానికి అత్యంత అనుకూల స్థలం ఆగ్నేయం. ఇది అగ్ని మూల కావడం వల్ల గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడూ ఈ దిశలోనే అమర్చాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ధాన్యానికి కొరత ఉండదు.
వంట చేసే వ్యక్తి ముఖం ఎప్పుడూ తూర్పు వైపునకు ఉండేలా చూసుకోవాలి. తూర్పు దిశగా నిలబడి ఆహారాన్ని వండటం వల్ల ఆ వంట ఆరోగ్యంగా మారడమే కాకుండా, ఇంట్లోని వారందరికీ దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం చేకూరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతోన్నారు. పొరపాటున కూడా పడమర లేదా దక్షిణ దిశల వైపు ముఖం పెట్టి వంట చేయడం మంచిది కాదు.














Click it and Unblock the Notifications