జాతకచక్రం ఎప్పుడు వ్రాయించాలి.. ఉచితంగా జాతకం చెప్పించుకుంటే ఏం జరుగుతుంది..?
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు అనేక అపోహలతో బిడ్డలకి 12 ఏళ్ళదాకా బాలారిష్టాలుంటాయి, అందుకే 12 ఏళ్ళు దాటితేగానీ జాతకం వేయించకూడదంటారు. కొందరు బిడ్డ పుట్టగానేనో పురిటి స్నానం కాగానేనో లేదా వీలయినంత తొందరగా వేయిస్తారు.
బిడ్డ పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వరకూ మాత్రమే బాలారిష్టాలుంటాయంటారు. నిజమే మరి 12 సంవత్సరాలదాకా జాతకం వేయించకపోతే ఏమైనా గ్రహ దోషాలు, నక్షత్ర పాద దోషాలు వుంటే శాంతులు ఎప్పుడు చేయిస్తారు. అఫ్ కోర్స్ ఇవ్వన్నీ నమ్మకాలున్నవాళ్ళకేననుకోండి. కొన్ని సార్లు జన్మ నక్షత్రం బాగా లేదని శాంతి చేయిస్తారు.

అంతేకాదు బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేదాకా ఏ చెడ్డ పని చేసినా దాని బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే బిడ్డ 12 సంవత్సరాల వరకు తల్లిదండ్రులపై ఆధారపడుతూ సొంత ఆలోచనావిధానం ఉండదు. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత వీలయినంత త్వరలో జాతకం వేయిస్తే, ఏవైనా గ్రహ శాంతులు వగైరాలు అవసరమైతే చేయించవచ్చు. అదీగాక జాతకం ప్రకారం బిడ్డ ఎలాంటి మనస్తత్వం కలవాడై వుంటాడో కూడా తెలుస్తుంది. ఆ విషయాలు ముందు తెలుసుకోవటం ద్వారా ఆ బిడ్డని ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చి దిద్దటానికి తల్లిదండ్రులకి సహాయంగా వుంటాయి.
ఇబ్బంది ఏర్పడిన తరువాత జ్యోతిష్కుని వద్దకు వెళ్ళడం కన్నా ముందుగా రాబోయే ఇబ్బందులను తెలుసుకొని అవి రాకుండా చేసుకోవలసిన శాంతి మార్గాలను తనంతట తాను చేసుకోగలిగే సూచనల కోసం జ్యోతిష్కున్ని ఎల్లప్పుడు సంప్రదించటం అలవాటు చేసుకోవాలి. శిశువు పుట్టిన 11 రోజుల ( పురుడు ) అయిన తరవాత అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుని సంప్రదించి జాతక చక్రం వేయించి ఏమైనా దోషాలు ఉంటే శిశువు పుట్టిన 27 రోజులలోపు శాంతి పరిహారం జరిపించుకోవాలి.
జాతకచక్రం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం తెలిసి ఉండాలి. ఇవి తెలియని వారికి జన్మ జాతకంలోని జాతక వివరాలు తెలుసుకోవటం కష్టం.
* శిశువుకు 12 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాతనే ద్వాదశ భావ ఫలితాలను అడిగి తెలుసుకోవాలి.
* 16 సంవత్సరాలు నిండిన తర్వతనే సంపూర్ణ జాతక ఫలితాలను తెలుసుకోవాలి.
* జాతకం అనేది అన్ని వయస్సులవారికి, అందరికీ అవసరమే. తన జాతకంలో ముందు జరగబోయే గ్రహ స్థితుల తెలుసుకుని ముందస్తుగా జాగ్రత్తలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది.
* జాతకాన్ని వ్రాయించుకోవడానికి వెళ్ళే ముందు జ్యోతిష పండితుని కొరకు స్వయంపాకాన్ని, పండ్లు తీసుకుని వెళ్ళాలి, జాతక విశ్లేష తర్వాత దక్షిణ తాంభూలం తప్పక ఇవ్వాలి. తెలిసిన వారే అని ఉచితంగా జాతకం వేయించుకోకూడదు. ముఖ్యంగా ఫోన్ ద్వారా జాతకాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. కర్మానుసార విషయమై పండితునికి ఋణ గ్రస్తులు కాకూడదు.
* జాతకం వ్రాయించడం ఎంత ముఖ్యమో, శాస్త్ర సంబంధితమైన పద్దతులను ఆచరించడం అంతకన్నా ముఖ్యం అని గ్రహించాలి. జాతకం వినడం కాదు ముఖ్యం శాస్త్ర నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి.












Click it and Unblock the Notifications