నేడు శక్తిమంతమైన అమావాస్య: జాతక దోషాలు తొలగిపోవాలంటే.. !!
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే అమావాస్యను కర్ణాటకలో భీమన అమావాస్య, ఆటి అమావాస్య, ఉత్తరాదిన హరియాళీ అమావాస్య, శ్రావణ అమావాస్యగా జరుపుకొంటారు. శివారాధన, పితృ తర్పణాలు, దానధర్మాలకు ఈ రోజు ఎంతో ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఫలితంగా.. దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. భక్తులు పుణ్యస్నానాల ఆచరిస్తోన్నారు. పూజాదికాలను నిర్వహిస్తోన్నారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత 1: 52 నిమిషాలకు అమావాస్య ప్రారంభమైంది. ఈ రాత్రి 11:06 నిమిషాలకు ముగుస్తుంది. ఇదే రోజున రాత్రి 9:04 నిమిషాల నుంచి 13వ తేదీ తెల్లవారుజామున 4:25 నిమిషాల వరకు సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది మనదేశంలో కనిపించదు. దీనివల్ల సూతక కాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

ఈ పవిత్రమైన రోజున నదీ స్నానానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ఆ వీలు లేకపోతే.. ఇంట్లోనే గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. ఈ రోజున చేసే క్రతువులో మన పూర్వీకులు, పితృ దేవతల నుంచి ఆశీస్సులు లభిస్తాయనే విశ్వాసం ఉంది. సూర్యోదయం నుండి అమావాస్య తిథి ముగిసే వరకు పితృ తర్పణం, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు.
శక్తి కొద్దీ నువ్వులు, అన్నం, వస్త్రాలు లేదా ధనాన్ని అవసరమైన వారికి దానం చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని, పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. రావి చెట్టు కింద దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. వేప, ఉసిరి, తిప్పతీగ, మర్రి, రావి మొదలైన మొక్కలను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా నాటడం వల్లే ఉత్తరాదిన ఈ అమావాస్యను హరియాళీగా పిలుస్తారు.
పితృ శాంతి కోసం శ్రీమద్భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేయడం అత్యంత ప్రయోజనకరంగా భావిస్తారు. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ అమావాస్య రోజున శివాలయాలను సందర్శించాలి. శివలింగానికి పాలు, గంగాజలం, బిల్వపత్రాలను సమర్పించాలి. దీనివల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయని, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుందని పండితులు చెబుతున్నారు. శివ మంత్రోచ్ఛారణ, మహా మృత్యుంజయ, హనుమాన్ చాలీసా వంటి మంత్రాలను జపించడం వల్ల దైవానుగ్రహం పుష్కలంగా లభిస్తుందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు.













Click it and Unblock the Notifications