ధంతేరస్ నాడు చీపురు ఎందుకు కొనాలి? ఆ రెండు చీపుర్ల రహస్యం ఏంటి?
దీపావళి పండుగ అనగానే మనకు టపాసులు, దీపాలు, మిఠాయిలు గుర్తుకొస్తాయి. కానీ, దీపావళికి ముందు వచ్చే 'ధంతేరస్' రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలే కాకుండా... అత్యంత సాధారణమైన ఒక వస్తువుకు ఎంతో ప్రత్యేకత ఉంది. అదే 'చీపురు'! ధరలో ఎంతో తక్కువైనప్పటికీ, మతపరమైన నమ్మకాల ప్రకారం ధంతేరస్ రోజున చీపురు కొనడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం!
పరిశుభ్రతే మహా భాగ్యం
నవంబరు 8న దీపావళి వచ్చింది. దానికి రెండు రోజుల ముందు అంటే 6వ తేదీన ధంతేరస్ వచ్చింది. ఆరోజు ఇళ్లను శుభ్రంగా ఉంచడంలో చీపురు పాత్ర ఎంతో కీలకం. అందుకే దీన్ని కేవలం ఒక వస్తువులా కాకుండా, పరిశుభ్రతకు, క్రమబద్ధమైన జీవనానికి చిహ్నంగా చూస్తారు. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, అక్కడే సిరుల తల్లి లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దల నమ్మకం. ఒకవేళ ఇంట్లో చెత్తాచెదారం, అపరిశుభ్రత ఉంటే దరిద్రానికి ప్రతీక అయినవన్నీ పేరుకుపోతాయని విశ్వసిస్తారు. అందుకే పండుగ వేళ ఇంటిని శుభ్రం చేయడానికి చీపురును పవిత్రంగా భావించి కొనుగోలు చేస్తుంటారు.

ధంతేరస్ రోజున రెండు చీపుర్లు ఎందుకు కొనాలి?
జ్యోతిష్య నిపుణుల ప్రకారం, వీలైతే ధంతేరస్ రోజున ఒక్కటి కాకుండా రెండు చీపుర్లు కొనుగోలు చేయడం మంచిదని చెబుతుంటారు. మొదటి చీపురు: దీన్ని మన ఇంటి అవసరాల కోసం, అంటే ఇల్లు ఊడ్చుకోవడానికి ఉపయోగించాలి. రెండో చీపురు: ఈ రెండో చీపురును మన సొంత ఇంటికి వాడకుండా, ఏదైనా సమీపంలోని ఆలయానికి దానం చేయాలి. దేవాలయాలు ఎల్లప్పుడూ పవిత్రంగా, అందరికీ ప్రశాంతతను పంచే ప్రదేశాలు.
అలాంటి పవిత్ర స్థలానికి చీపురును దానం చేయడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుందని, ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. అయితే ఇది ఎవరి బలవంతం మీదో చేసేది కాదు. ఎవరి నమ్మకాలు, వారి ఆర్థిక స్థోమతను బట్టి ఆచరించవచ్చు. ఏదేమైనా, ధంతేరస్ రోజున చీపురు కొనే ఈ సంప్రదాయం మన ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలనే మంచి సందేశంతో పాటు, మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలని గుర్తుచేస్తుంది!














Click it and Unblock the Notifications
