Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తరాయణంలో సూర్యారాధన రథసప్తమి.. సూర్య స్నానం వల్ల లాభాలేంటో తెలుసా?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆది నారాయణుడే సూర్య నారాయణుడు. భారతీయ ఖగోళ శాస్త్రం నవగ్రహాలలో సూర్య గ్రహం ప్రధానమైనదిగా పేర్కొంది. ప్రపంచ భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు దాన్ని సమర్థించారు. అయితే జనుల దృష్టిలో ఆయన సాక్షాత్తూ భగవంతుడే! సూర్యుడు 'త్రిమూర్తుల స్వరూపం' అని మహాఋషులు భావన చేశారు. సృష్ట్యాదికి పూర్వమే ప్రత్యక్ష దైవంగా లోకానికి వెలుగును ఇచ్చిన నారాయణుడిగా ఆయనను ఆరాధించారు. సూర్యారాధన యుగయుగాల నుంచీ వస్తోంది. వేదాలు ప్రముఖంగా ప్రస్తావించిన ఆదిదేవుడు సూర్య నారాయణుడు. ఇతిహాసాలూ, పురాణాలూ ఆ దివాకరుణ్ణి అనేక విధాల ప్రశంసించాయి.

ప్రాణికోటికి ఆలంబన

ప్రాణికోటికి ఆలంబన

సూర్యుడిపై ప్రత్యేకంగా రచించిన ఉపనిషత్తు ‘అక్ష్యుపనిషత్తు'. ‘సూర్య ఆత్మా జగత్‌ సస్తుషస్యః' అన్నది ఋగ్వేదం. ‘జగత్తులో ప్రాణులు అన్నిటికీ సూర్యుడే ఆత్మ' అని భావం. ‘ప్రాణోవై అర్కః' - ప్రాణమే సూర్యుడు. ‘స ఏష వైశ్వానరో, విశ్వరూపః, ప్రాణో అగ్ని రుద్రయతే' అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది. ‘‘సూర్యోదయంతోనే జగత్తులో ప్రాణాగ్ని సంచారం చేస్తుంది. సూర్యుడి వల్లనే సమస్త ప్రాణికోటికీ ప్రాణం లభిస్తుంది'' అని ‘శతపథ బ్రాహ్మణం' వివరించింది.

ఆరోగ్యకారకుడు

ఆరోగ్యకారకుడు


‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌' అని శాస్త్రవచనం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. శరీరానికి సూర్యకిరణాలు తాకడం వల్ల (సన్‌ బాత్‌) ఆరోగ్యం చేకూరుతుందనీ, కొన్ని రకాల రుగ్మతలు నివృత్తి అవుతాయనీ ప్రకృతి వైద్య శాస్త్రం చెబుతోంది.

కవులకు స్ఫూర్తిప్రదాత

కవులకు స్ఫూర్తిప్రదాత

రామాయణంలో అడుగడుగునా సూర్యుడి ప్రస్తావన ఉంది. శ్రీరామ లక్ష్మణులను మేలుకొలుపుతూ ‘పూర్వా సంధ్యా ప్రవర్తతే' అంటాడు విశ్వామిత్రుడు. కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం'లోని సుందరకాండలో హనుమంతుడు సూర్యుణ్ణి కీర్తిస్తూ ‘వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్‌ పరమార్థభూతమై, వెలుగులు తన్ను మించి మరి విశ్వంబున వేరు చోట లేవు' అంటాడు. అంబుధి దాటలేక హనుమంతుడు అలసిపోయి, తన గురువే (సూర్యుడే) ఆదుకుంటాడని చెబుతూ, ‘అంబుధి శోషణ దాహమూర్తి' అలా సహాయపడతాడని అంటాడు.

కవిత్వానికి స్ఫూర్తి

కవిత్వానికి స్ఫూర్తి

కవిత్వ సద్గురు మూర్తిగా ప్రసిద్ధి చెందిన కవి మారన తన కవిత్వానికి స్ఫూర్తినిచ్చిన సూర్యుడిపై ఏకంగా భాస్కర శతకం రచించాడు. అన్నమయ్య ఆదిగా ఎందరో కవులు సూర్యుణ్ణి వినుతిస్తూ తెలుగు వాఙ్మయాన్ని దివారుకుడి వెలుగులతో నింపారు. శివుడు తాండవ నృత్యం చేయడానికి సాయంసంధ్య ఇష్టమైన కాలమని శంకర భగవత్పాదులు ‘శివానందలహరి'లో చెప్పారు. ‘భవ చండ తాండవ భ్రమర వేగమున దివి నుంచి పడిన అందియ బోలి అరుణ బింబము పశ్చిమాంబుధి గృంకె' అంటాడు గౌరన కవి. సముద్రంలోకి అస్తమిస్తున్న సూర్యుడి బింబం శివ తాండవ ఉధృతికి ఆకాశం నుంచి జారి పడిన అందెలా ఉందిట! సూర్యనారాయణుడు ‘జగచ్ఛక్షువు కాదు, జగదక్షుడు' అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. అంటే జగతికే నేత్రమైన సూర్యుడి ప్రకాశం లేకపోతే కంటికి చూపే లేదు.

కర్తవ్య ప్రేరేపకుడు

కర్తవ్య ప్రేరేపకుడు

‘సూర్యుడు' అనే పదానికి ‘సువతి ప్రేరయితి జనాన్‌ కర్మణేతి సూర్యః' అని వ్యుత్పత్తి. ‘లోకులు వారి కర్తవ్యాలను నిర్వహించుకోవడానికి ప్రేరణ ఇచ్చేవాడు' అని అర్థం. ఈ విధంగా జగత్తును తన వెలుగుతో నడిపిస్తున్నవాడు సూర్య భగవానుడు. మహాభారతంలో ‘రోదసీ కుహరంబు రుచిరాంశుతతి జేసి, యర్కుండు వెలిగించునట్టు' అంటూ భీష్ముని నోట పలికిన భావం ఇదే! జగత్తుకు- జగదీశ్వరుడైన సూర్యుడికీ అంతటి అవినాభావ సంబంధం. ఆయనను ‘కర్మసాక్షి' అని పూర్వులు సంబోధించారు. ‘ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు'నన్నాడు మహాకవి పోతన. అందుకే సూర్యుడు అందరివాడు.

సప్తాశ్వ రథ మారూఢం...

సప్తాశ్వ రథ మారూఢం...

సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు అవి: గాయత్రి, బృహతి, ఉష్ణిక్‌, జగతి, త్రిష్ఠుప్‌, అనుష్ఠుప్‌, పంక్తి. అలాగే ఆ గుర్రాలను ఏడు వారాలుగా, ఇంద్రధనుస్సులోని ఏడు రంగులుగా, సప్త ఛందస్సులుగా కూడా పరిగణిస్తారు.
సూర్యుడి రథానికి ఉన్న ఆకులు పన్నెండు. వాటిని నెలలుగా, రాశులుగా భావిస్తారు. రథానికి ఉన్న రెండు ఇరుసులు రాత్రి, పగలు. సూర్యుడి రథ సారథి పేరు అనూరుడు. అతను గరుత్మంతుడి సోదరుడు. ఊరువులు (తొడలు) లేకుండా జన్మించాడు కాబట్టి అతణ్ణి ‘అనూరుడు' అంటారు.సూర్యుని తండ్రి కశ్యపుడు. తల్లి అదితి. అందుకే ఆయనను ‘ఆదిత్యుడు' అంటారు.

ఉత్తరాయణం ప్రాముఖ్యత

ఉత్తరాయణం ప్రాముఖ్యత

సూర్యుడికి చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ ఉన్న నామాలు- ధాతీ, ఆర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్‌, పూషా, పర్జన్య, అంశుమాన్‌, భగ, తష్ట్వా. విష్ణు. ఇవి ద్వాదశాదిత్య నామాలు.
ఆరు నెలలు దక్షిణ దిశలో, ఆరు నెలలు ఉత్తర దిశలో సూర్యుడి పయనం సాగుతుంది. అవే ‘దక్షిణాయణం', ‘ఉత్తరాయణం'. మకర సంక్రాంతి రోజున సూర్యుడి ఉత్తరాయణం, కర్కాటక సంక్రమణం రోజున సూర్యుడి దక్షిణాయణం మొదలవుతాయి. వీటిలో ఉత్తరాయణాన్ని అత్యంత పవిత్రకాలంగా భావిస్తారు. సూర్యుడి జయంతి అయిన మాఘ శుద్ధ సప్తమి ఉత్తరాయణంలోనే వస్తుంది. దీనినే ‘రథసప్తమి' అని కూడా అంటారు.
ప్రతిరోజూ సూర్యాష్టకం చదివితే గ్రహబాధలు తొలగడంతో పాటు ఆరోగ్యం కూడా ఒనగూరుతుంది. ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేస్తే ఆరోగ్యంతో పాటు సర్వత్రా విజయం చేకూరుతుంది అని పురాణాలు చెబుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+