తులసి మంజరులు ఎలా పడితే అలా తుంచొద్దు- ఇలా ఉపయోగించండి
హిందూ సంప్రదాయంలో తులసికి విశిష్టమైన స్థానం ఉంది. సాక్షాత్ లక్ష్మీదేవి అవతారంగా భావించి ప్రతిరోజూ పూజిస్తారు. కొన్నిసార్లు తులసి మొక్కకు ఎక్కువ సంఖ్యలో మంజరులు (గింజల కంకులు లేదా పూత) రావడం మనం గమనిస్తుంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కపై మంజరులు రావడం ఇంట్లోకి రాబోయే సానుకూల మార్పులు, ఐశ్వర్యానికి సంకేతం.
చాలామంది భక్తిశ్రద్ధల వల్ల తులసి మంజరులను మొక్క నుంచి వేరు చేయడానికి సంకోచిస్తూ అలాగే ఉంచేస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కపై మంజరులు ఎక్కువ కాలం పొడిగా ఉండిపోవడం వల్ల మొక్కపై తీవ్రమైన భారం పడుతుంది. దీనివల్ల మొక్క క్రమంగా ఎండిపోయే ప్రమాదం ఉంది. తులసి మొక్క ఎండిపోవడం వాస్తు దోషంగా పరిగణిస్తారు. అందుకే ఈ మంజరులను సకాలంలో తొలగించాలి.

ఆర్థిక ఇబ్బందులు తొలగించే తులసి మంజరి చిట్కాలు
తులసి నుంచి వేరు చేసిన మంజరులను చెత్తలో పారేయకూడదు. ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు. ఎలా పడితే అలా తుంచనూ కూడదు. ఎండిపోయిన మంజరులను ఒక శుభ్రమైన ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టి, ఇంట్లో బీరువా లేదా డబ్బును దాచే స్థలంలో ఉంచడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. ఇది వ్యాపారంలో నష్టాలను తగ్గించి, కొత్త ఆదాయ మార్గాలను పెంచుతుందని నమ్ముతారు.
ఇళ్లలో నెగటివ్ ఎనర్జీని పోగొట్టడానికి రోజూ పూజ చేసే సమయంలో వెలిగించే దీపంలో కాస్త ఎండిన మంజరి పొడిని వేయవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడి లేదా అలసటతో బాధపడేవారు స్నానం చేసే నీటిలో కొన్ని మంజరులను వేసుకుని స్నానం చేయడం చాలా మంచిది. ఇది శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగించి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే, ప్రతి శుక్రవారం తాజా లేదా ఎండిన తులసి మంజరులను విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించడం వల్ల వారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి ఎల్లప్పుడూ ప్రశాంతత నెలకొంటుంది.
తులసి మంజరిని కోసేటప్పుడు పాటించాల్సిన నియమాలివే
తులసి పవిత్రతను కాపాడటానికి కొన్ని కఠినమైన నియమాలను శాస్త్రాలు నిర్దేశించాయి. ఆదివారాలు, ఏకాదశి తిథులు, సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను గానీ, మంజరులను గానీ అస్సలు తాకకూడదు, కోయకూడదు. కోసిన మంజరిని ఎక్కడపడితే అక్కడ పారేయకుండా పూజ గదిలోనే పవిత్ర పనులకు ఉపయోగించాలి. కుదిరితే తులసి కోటలోని మట్టిలోనే తిరిగి కలిపేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
తులసి మొక్కను పూర్వీకులు అలవాటు చేసిన పద్ధతి రూపంలోనే కాకుండా, ఇంట్లోని సానుకూల తరంగాలకు ప్రధాన వనరుగా భావించి సంరక్షించుకోవాలి. మంజరులను సరైన సమయంలో వేరు చేయడం ద్వారా మొక్క ఆయుష్షును పెంచడమే కాకుండా, మన జీవితంలో ఉన్న ఎన్నో వాస్తు సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. సరైన దిశలో మొక్కను ఉంచి పూజించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి.












Click it and Unblock the Notifications