• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నైమిశారణ్యం అంటే ఏంటీ ? ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత ఏంటీ..!!

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.

ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణములు వినిపించెను.

what is Nimayasarna

ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.ఇది ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఉంది.

పేరువెనుక చరిత్ర :- ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను. (నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో "నైమిశ" మయ్యెను . ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.

వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలివెళ్ళండి ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది.

చక్రం విరిగిన ప్రదేశంలో ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితా దేవి ఆలయంగా పేరుగాంచింది. చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయింది. నిమి అంటే చక్రకైవారం, అరణ్యం - అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమి శారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురులను ఈ ప్రాంతంలో సంహరిస్తాడు. నిమి (లిప్త) (సెకండు) లో అసురుల్ని సంహరించిన ఈ అరణ్యం నైమిశారణ్యంగా పేరొందినదని పేర్కొనబడింది. ఇక్కడే వ్యాస పీఠం, దధీచి కుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి 'లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.

నైమిశారణ్యము కొన్ని విశేషాలు :- నైమిశారణ్యములో వర్ణించబడిన చెట్లు, వృక్షాలు, లతలు. సరళ (తెల్ల తెగడ), కొండగోగు, ధన (ఉమ్మెత్త), దేవదారు, చండ్ర, మామిడి, నెరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, చమ్దన, అగరు, పాటల (కలికొట్టు), నకుల (పొగడ), సప్తవర్ణ (ఏడాకుల పొన్న), పునాగ, సురపొన్న, నాగకేసర (నాగకింజల్కము), శాల, తాల (తాటి), తమాలము (చీకటిమాను), అర్జున (మద్ది ), చంపక (సంపెంగ).

నైమిశారణ్యం ఆలయం ఎనిమిది స్వయంవ్యక్త ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిశారణ్యం ఇవి స్వయంవ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి.

నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలా రణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు. గయ క్షేత్రం చరణ గయగా, బద్రిశిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరుగాంచాయి. ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.ఇక్కడకు 9 కి.మీ.దూరంలో మిశ్రిక్‌ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు.

శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే.

చూడవలసిన ప్రదేశాలు :-వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిశారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్రత్తాళ్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ సీతా ఆలయాలు ఉన్నాయి.గోముఖినది మార్గంలో వ్యాస ఘాట్‌ ఉంది. మరోవైపు శుకమహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది.నైమిశారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్‌. శ్రీమన్నారాయణుడు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది.

చక్రతీర్థం, గోముఖినది, సెమీతీర్థం, దివ్యవిశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి.శివపురాణంలో కూడా నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిశారణ్యం ఉండేది. ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహి స్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతినది, దధీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.

ఆలయాలు :-నైశారణ్యంలో చూడదగినవి వ్యాసగద్దె, సూతగద్దె, దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, మొదలైనవి ఉన్నాయి.రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయని విశ్వసిస్తున్నారు. ఆ అడుగున శివమూర్తి ఉంది.

భూతేశ్వరాలయం :- చక్రతీర్థానికి పక్కనే ఉండే దేవాలయాన్ని భూతేశ్వరాలయం అంటారు. ఈ ఆలయం పుట్టుకకి ఒక గాథ ఉంది. గయుడు అనే రాక్షసుడు విష్ణుధ్వేషంతో పరమశివుని గురించి తపస్సు చేసాడు. కానీ విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అను గ్రహిస్తానన్నాడు. దానికి గయుడు కోపంతో నేను శివుని గురించి తపస్సు చేసుకుంటుంటే, నిన్నెవడు రమ్మన్నాడు. నీవు నాకు వరమిచ్చే వాడివా! నేనే నీకు వరం ఇస్తాను ఏం కావాలో కోరుకో అన్నాడు. వాడి అహంభావానికి శ్రీహరి మనసులో నవ్వుకుని, అయితే సరే గయుడు నా చేతిలో మరణించేటట్టు వరం ఇవ్వమని అడిగాడు. ఇక మాట తప్పలేక గయుడు ఆ వరం శ్రీహరికి ఇచ్చేసాడు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయుని మూడు భాగాలుగా నరికేసాడు. అందులో ఒక భాగం గయలో పడగా, రెండవ భాగం నైమిశారణ్యంలోనే పడింది. మూడవ భాగం బదరీనాథ్‌లో పడింది. ఈ మూడు ప్రసిద్ద క్షేత్రాలుగా వెలిసాయి. ఈ నైమిశారణ్యంలో పడిన చోట ఆలయ నిర్మాణం జరిగింది. అందులో వేలుపుని భూతేశ్వరుడు అని వ్యవహరిస్తారు.

చక్రతీర్థం :-భూతేశ్వరాలయానికి ప్రక్కనున్న సరస్సే చక్రతీర్థం అంటారు. ఇది వృత్తా కారంలో ఉండి చుట్టూ మెట్లుండి స్నానమాచ రించడానికి అనువుగా ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనేక రుగ్మతలు నయమవుతాయని ప్రజల విశ్వాసం.

వ్యాసగద్ది :- ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద వ్యాసమహా ముని నివసించిన ప్రదేశం ఉంది. దీనినే వ్యాసగద్ది అంటారు. ఈ కాలంలో గోమతీ నదిని ధ్యానమతి గంగ అని కూడా పిలిచేవారు. ఈ ప్రదేశంలో ఒక పీఠంలాంటి గద్దెపై పట్టువస్త్రంతో అలంకరించి ఉంచారు. ఆనాడు వేద వ్యాసుడు ఇక్కడ కూర్చుని మహా భారతాన్ని చెప్తుంటే, విఘ్నేశ్వరుడు ప్రక్కన కూర్చుని రాసిన పవిత్ర స్థలం ఇదే. ఈ పక్కనే వ్యాసుని కుమారు డైన శుకమహర్షి పాల రాతి విగ్రహం, కొద్ది దూరంలో పరీక్షితు మహారాజు, శుకమహర్షి శిష్యుడైన శ్యాం చరణ్‌ మహారాజుల విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి.

ప్రాచీన కాలంలో గోమతిని ధ్యానమతి గంగ అనేవారట. ఇక్కడ నిలుచుని చూస్తే, ఒకపక్క ప్రవహించే గోమతి, మూడు పక్కలా దట్టంగా వ్యాపించిన అరణ్యంతో మనోహరమైన దృశ్యం కనువిందు చేస్తుంది. ఇక్కడ చిన్న మందిరాన్ని నిర్మించారు. ముందున్న యజ్ఞశాలలో ఇప్పటికీ యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. వచ్చినవారు యజ్ఞవాటికకు ప్రదక్షిణ చేసి అందులోవున్న భస్మాన్ని నుదుట ధరించి వ్యాసగద్ది దర్శిస్తారు.

లలితాదేవి ఆలయం:- ఈ నైమిశారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన దేవత లలితాదేవి. పాలరాతి తోరణాలు, విశాలమైన మండపం ఉండి నిత్య జనసందోహాలతో అమ్మవారి పూజలతో కళకళలాడుతూ వుంటుంది.

హనుమాన్‌ ఘరి:- మైరావణ యుద్ధసమయంలో రామలక్ష్మణులతో హనుమ ఈ మందిర విశేషానికి వస్తే, రామలక్ష్మణుల్ని మైరావణుడు అపహ రించుకుపోయాకా, ఆ మాయని ఛేదించి హనుమంతుడు రామలక్ష్మణుల్ని తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువచ్చిన ప్రదేశం ఇదే. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నిలు వెత్తులో ఉండి, భుజాలమీద రాముడు, లక్ష్మణుడు, హనుమంతుని కాలికింద తొక్క బడుతూ మైరావణుడు ఉంటారు. అంజనేయ స్వామి నిత్యపూజలతో, భక్తులతో నిత్యం నయనానందకరంగా ఉంటుంది.

నైమిశనాధ దేవాలయం:- ఇక్కడి స్వామి నైమిశారణ్యం క్షేత్రపాలకుడు. వేంకటేశ్వర స్వామిని పోలిన ఆకారంలో ఉంటాడు. నల్లని విగ్రహం బంగారు ఆభరణాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది. అలాగే అహౌ బిలం వారు నిర్మించిన నారసింహ దేవాలయం, దదీచి కుండం, బలరాముడు ఇక్కడకి వచ్చిన ప్రదేశం, చూడదగ్గవి. అన్నిటినీ మించి ఇక్కడి రమణీయ దఋశ్యాలు అనేకం మనకి కనువిందు చేస్తాయి.

పురాణ పురుషాలయంలో శుకుడు ఇక్కడ ఆనందమయి మాత ఫౌండేషన్‌ వారు నిర్మించిన పురాణ పురుషుని మందిరం చాలా అందమైన నిర్మాణం. పురాణ పురుషుని విగ్రహం పంచలోహంతో మలచారు. చిలుక తలతో, అభయముద్రలో, ప్రశాంత గంభీర వదనంతో వుంటుంది. ఇక్కడ పురాణాం మీద పరిశోధన జరుగుతోంది. 18 పురాణాల తాళ పత్ర గ్రంథాలు పట్టుబట్టలో చుట్టి ఒక వేదిక మీద ఉంచారు. దీని చుట్టూ రేలింగ్‌ అమర్చి ఒక పక్క వేదవ్యాసుని విగ్రహం ప్రతిష్ఠించారు. మరో పక్క నూతుని విగ్రహముంది. దీనికి ప్రక్కనే బహు విశాలమైన గోష్ఠిమందిరం పెద్ద పెద్ద పట్టుపురుపులతో, గద్దెలతో పవిత్ర వాతావరణం ఆవరించింది ఉంది.

దధీచి కుండము:- ఇది ప్రసిద్ధికెక్కిన స్థలం. దీనికో పౌరాణిక గాథ ఉంది. దేవదానవ యుద్ధాలు తరతరాలుగా జరిగాయని పురాణకథనాలు వివరిస్తున్నాయి. అలాంటి ఒక యుద్ధంలో తారకాసురుడు విజృంభించి, దేవతలనందరినీ చంపుతున్న తరుణంలో ఇంద్రుడు విష్ణువును సమీపించి దేవతలకు రక్షంచమని వేడుకున్నాడు. విష్ణుమూర్తి సలహా మేరకు దధీచి మహర్షి ఎముకతో తయారుచేసిన ఆయుధం రాక్షస సంహారం చేయగలదని తెలిపాడు, ఇంద్రుడు ఆ మహర్షిని దర్శించి జరిగిన విషయం వివరించి ఆయన వెన్నెముకను ఇవ్వమని కోరాడు .

ఆ మహాత్ముడు ఈ కోరిక లోక కళ్యాణార్థమని గ్రహించి, యోగమార్గాన తన శరీరాన్ని త్యజించాడట. ఆయన సుదీర్ఘ తపస్సుతో, అనూహ్యశక్తి సంపన్నమైన ఆయన ఎముకతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారుచేసుకుని విజయం సాధించాడట. ఇప్పటికీ ఇదే ఇంద్రుని ఆయుధం. ఈ సంఘటన జరిగిన ప్రదేశంగా ఈ దధీచికుండానికి ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది. లోకకళ్యాణార్థం, తన శరీరాన్ని తృణప్రాయంగా త్యజించిన త్యాగనిరతికి ప్రత్యక్ష నిదర్శనం ఈ దధీచి కుండం.

బలరాముని ప్రాయశ్చిత్తం :-బలరాముని గురించిన పురాణగాధలో బలరాముడు నైమిశారణ్యంలో ప్రాయశ్చితకర్మలు నిర్వహిన్నట్లు తెలుస్తుంది. కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బలరాముడు తాను తటస్థంగా వుండిపోవాలని నిశ్చయించుకుని, తీర్థయాత్రలకు బయలుదేరి, దానిలో భాగంగా నైవిశారణ్యం చేరుకున్నాడు. ఆ సమయంలో మునులందరూ ఆధ్యాత్మిక విషయాలపై సుదీర్ఘమైన సత్సంగంలో ఉన్నారు. బలరాముని చూసి అందరూ లేచి నమస్కరించారు.

సభకు ఆచార్యపీఠాన్నలంకరించిన వారు ఇలా లేవకూడదు. కనుక ఆ స్థానంలో వున్న రోమహర్షణుడు (నూతుడు) లేచి నమస్కరించలేదు. ఇది అవిధేయతగా భావించి దీనిని సహించలేని బలరాముడు సూతుని శిరస్సు ఖండించాడు. మునిగణాలలో అహంకారాలు చెలరేగినాయి. ఈ ఉద్విగ్నిత కొంత ఉపశమించిన తరువాత ఈ బ్రహ్మహత్యా పాతకానికి బలరాముని ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు. అప్పటికే పశ్చాత్తాపపడుతున్న బలరాముడు ప్రాయశ్చిత్తమేదో వారినే నిశ్చయింపమన్నాడు. వారు అక్కడ బల్వుడనే రాక్షసుడు మహా భయంకరుడు. అమావాస్య, పౌర్ణమి రోజులలో మా సమావేశాలను భగం చేస్తూ, రక్త మలమూత్రాలు మాపై కురిపిస్తున్నాడు.

ముందు వాణ్ణి సంహరించి మాకుపకారం చేయి. తరువాత 12 మాసములు బ్రహ్మవర్తంలోని సకల తీర్థాలు సేవిస్తే బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తుడవుతావని తెలిపారు. ఇంతలో పౌర్ణమిరానే వచ్చింది. పెద్ద తుఫాను చెలరేగి, చీము, రక్తమూ వర్షిస్తూ నల్లని పర్వతాకారంలో అతి భయంకరంగా బల్వలుడు విజృంభించాడు. బలరాముడు తన ఆయుధాలను స్మరించగనే అతని గద, నాగలి చేతికి వచ్చాయి. బలరాముడు గదతో వాడి తలవ్రక్కలు చేశాడు.వాడు భయంకరంగా అరుస్తూ నేలకొరిగారు. మునులందరూ మంత్రజలం చల్లి బలరాముని ఆశీర్వదించారు.

అప్పుడు బలరాముడు వేద ప్రమాణపరంగా మానవుడు తన ప్రతిరూపంగా పుత్రుడై జన్మిస్తాడు గనుక యికనుండి రోమహర్షుని తనయుడు మీకు పురాణ ప్రవచనం చేస్తాడు. అతనికి దీర్ఘాయువు, బలము ఇంద్రియపటుత్వము ప్రసాదిస్తున్నానని అన్నాడట. మునులందరూ అంగీకరించి అతణ్ణి వైజయంతి మాలతో సత్కరించి పంపారట.

ఇక్కడ మఠములు, రామానుజ కూటములు ఉన్నాయి. వనరూపిగా నున్న స్వామికే ఆరాధన. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరు మాళ్లుగాని ఇక్కడ లేరు. తిరుమంగై ఆళ్వార్లు వనరూపిగా నున్న స్వామినే కీర్తించిరని కొందరు పెద్దలు భావిస్తున్నారు. స్వయం వృక్ష క్షేత్రము. వ్యాస, శుక, సూతులకు సన్నిధులు ఉన్నాయి.సూత పౌరాణికుల మఠమున అనేక తాళపత్ర గ్రంథములు ఉన్నాయి.

ఒకప్పుడు మునులు బ్రహ్మవద్దకు పోయి భూమండలమున తపము చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్బతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇదిపడిన చోటు తపము చేయదగిన స్థలమని చెప్పాడట. ఆచక్రం పడిన చోటు నైమిశారణ్యము. ఇచట గోమతీనది ప్రవహించుచున్నది. ఇచట మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేసియున్నారు. ఆ సమయములో సూతుడు ఇక్కడ అష్టాదశ పురాణములను వినిపించెను.మహా పుణ్యక్షేత్రం భక్తుల కోరికలను తీర్చే ప్రదేశంగా కొనసాగుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Nimayasarna is located 94 km from Lucknow in the Sitapur district of Uttar Pradesh. Is in the distance. Situated on the banks of the Gomati River, this place is a sacred place where thousands of saints pray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more