వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వకర్మమయం జగత్ - దేవాది దేవుడు విశ్వకర్మ పరమాత్మ

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్లో. నభూమిర్నజలం చైవ నతేజో నచ వాయవః
నచబ్రహ్మా నచవిష్ణుః నచరుద్రశ్చ తారకాః
సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః

తాత్పర్యం:- భూమి - జలము - అగ్ని - వాయువు - ఆకాశము అనే పంచభూతాలు, బ్రహ్మ - విష్ణు - మహేశ్వర అనే త్రిమూర్తులు, ఇద్రుడు, సూర్యచంద్రులు, నక్షత్రములు అనేవి ఏవీ లేనప్పుడు విశ్వకర్మ భగవానుడు తనంతట తాను సంకల్ప ప్రభావంచేత అవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుడు, సహస్ర శీర్షుడు, సుగుణబ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మొదలైన అనంతనామములు మరియు అనంత రూపములు కలవు. ఆ పరబ్రహ్మమే "ప్రజాపతి విశ్వకర్మ" అని కృష్ణయజుర్వేదమున చెప్పబడియుండెను. ఆయన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనెడి ఐదు ముఖములతో ఆవిర్భవించాడు.

విశ్వకర్మ అనగా...

విశ్వకర్మ అనగా...

విశ్వకర్మ అనగా "విశ్వస్య యస్య కర్మ సః విశ్వకర్మా" అని నిరుక్తోక్తి. దీని భావం ఈ సమస్త విశ్వమునూ చేయు అవ్యక్త పరబ్రహ్మతత్వ స్వరూపం అని. నిజానికి విశ్వకర్మపరమాత్మునికి ఎటువంటి రూపమూ,గణమూ లేదు. కానీ మనము చూడదగిన మరియు చూడలేని అన్నిరూపములూ ఆయనే అయి ఉన్నాడు. అందుకే ఆయనను దేవతలు, యోగులు, తాపసులు నిరాకార సాకార సగుణ నిర్గుణ అవ్యక్త పరబ్రహ్మముగా భావించి ఆయన జ్యోతిస్వరూప సాక్షాత్కారానికై తపిస్తూ ఉంటారు. మరి మనం కొలిచే రూపం అంటారా అదికేవలం అందరూ దర్శించి మదిలో నిల్పుటకు ఏర్పరచిన సాంకేతిక ప్రతిమ మాత్రమే... సాధకులకు ఈ రూపం అక్కర్లేదు.

 భగవానుడు ఏ పురాణంలోను కనిపించడు

భగవానుడు ఏ పురాణంలోను కనిపించడు

నిరాకార స్వభావమున ఋగ్వేదంలో మొదటి ఋక్కులోని 'అ' కారము, యజుర్వేద మధ్యమంత్రం మధ్య అక్షరం 'ఉ'కారము, సామవేదం చివరి మంత్రపు చివరి అక్షరం 'మ'కారము ఈ మూడు అక్షరాల ద్వారా అథర్వణవేద స్వరాన్ని అనుసరిస్తూ "ఓం"కారం ఉద్బవించింది. అ , ఉ , మ' అను బీజాక్షరముల కలయికతో కూడిన నిరాకార " ఓం " అను ప్రణవాక్షరమేపరబ్రహ్మవిశ్వకర్మగా, సర్వశక్తికి మూలాధిదేవతగా ప్రకాశించుచున్నది. కావుననే సర్వదేవతలకు‌,సర్వశక్తులకు మూలమైనవాడు ప్రణవాత్మకపరబ్రహ్మ అయి ఉన్నాడు, కావుననే ఏ నామమునకైననూ,ఏమంత్రముకైననూ పరబ్రహ్మ సంకేతమైన " ఓం " అను ప్రణవము చేర్చి ఉచ్చరిచెదము..
"ఓం నమోనారాయణాయ " అనే అష్టాక్షరిమంత్రం అయినా " నమఃశివాయ" అనే పంచాక్షరి మంత్రమైనా లేదా స్త్రీ, పురుష దేవతలలో ఎవరినీ ధ్యానించిననూ మొదట 'ఓం' అను పరబ్రహ్మ స్వరూపమైన "విశ్వకర్మ" నామమును చేర్చనిదే ముక్తిని పొందలేము..

విశ్వమును చేసిన వాడిని "విశ్వకర్త" అనవలెను కానీ విశ్వకర్మ అని ఎందుకనవలసి వచ్చింది. ఏమిటీ "కర్మ" పద ప్రయోగ విశేషము. అని సందేహము కలిగిన యెడల మన యోచనాశక్తే దీనికి సమాధానం చెప్పగలదు. ఈ చరాచరజగత్తులోని పరమాణువు మొదలుకుని అండపిండ బ్రహ్మాండాదుల వరకూ కర్మ వలననే వాటి వాటి విధులను నిర్వహిస్తున్నాయి. ఈ నిరంతర కర్మయే దేనినైనా పుట్టించుట, జీవింపజేయుట, లయము నొందిచుట జరుపుచున్నది. ఆ కర్మకు ప్రతిరూపమే పరబ్రహ్మ అని భావం ..

ఈ విశ్వకర్మ పరమాత్ముని గురించి ఋగ్వేదములోనూ యజుర్వేదములోనూ సృష్టికర్తగానూ, అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగానూ వర్ణించడం జరిగింది. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్తయని ఏ పురాణములోనూ కనిపించదు, పురాణాలలో లేక పోవడానికి కారణం ఏమిటనగా మొదట వేదసారమంతా కలిసి ఒకటిగా ఉండేది దానినే 'తొలివేదం' అంటారు. ఈ తొలివేదం నుండి మలివేదంగా విడగొట్టినప్పుడు రచించే సందర్భంలో కొంత మార్పులు చేసి రాయడం జరిగినది. ఆ తర్వాత నాలుగు వేదాలుగా అవతరించినా వాటిని అర్థం చేసుకోలేకనో, చదవలేకనో, కొందరి స్వార్ధబుద్ధితో విశ్వకర్మ భగవానుణ్ణి సృష్టికర్తగా,పరమాత్ముడిగా పురాణములలో ప్రస్తావించ లేకపోయారు. కానీ నిత్యసత్యములైన వేదములలో మాత్రం సకల చరాచర సృష్టికి మూలం శ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవానుడే అని అభివర్ణించడం జరిగింది.

మనకు విశ్వకర్మలు ఎంతమంది ఉన్నారు

మనకు విశ్వకర్మలు ఎంతమంది ఉన్నారు

పురాణములలో ప్రస్తావింపబడిన విశ్వకర్మలు మరియు సృష్టికర్తగా చెప్పబడే పరమాత్మ విశ్వకర్మ ఒకటేనా అనే విషయానికొస్తే సృష్టికర్తయగు పరమాత్మ విశ్వకర్మ అనంత శిరస్సులు, అనంత నేత్రములు, అనంత పాదములు, అనంతబాహువులు కలవాడిగా అణువణువునా తానై ఉన్నవాడిగా ఋగ్యజుర్వేదములలోని పురుషసూక్తముల ద్వారా తెలియుచున్నది. సమస్తమునకు ఆయనే మూలపురుషుడు, ఆయనేతండ్రి, ఆయనే దాత, ఆయనే విధాత యని ఋగ్వేదం 10-81,82 కృష్ణయజుర్వేదము 4-6-2 లోని విశ్వకర్మ సూక్తముల ద్వారా తెలియుచున్నది. పురాణాలలో చెప్పబడిన విశ్వకర్మలందరూ సృష్టి ప్రారంభం మొదలుకొని నేటి వరకు కూడా వారివారి ప్రతిభాపాటవాలతో వివిధయుగాలలో అనేకానేక అద్భుతనగరములు నిర్మించి, దేవతలకు ఆభరణములను ఆయుధములను చేసి ఇచ్చి లోకకళ్యాణార్థం విశేష పాత్రలను పోషించియున్నారు.
ఇలాంటి విశ్వకర్మలు ఎందరో... అందులో కొందరిని ఇక్కడ తెలుసుకుందాం.

* త్వష్టవిశ్వకర్మ... ఇతనే సూర్యుని మామగారు.

* ప్రభాస విశ్వకర్మ... ఈయన అష్టవసువులలో ఎనిమిదవ వాడు.

* భౌవన విశ్వకర్మ ... ఈయన భువన ఋషికి పుట్టినవాడు. నీటమునిగియున్న భూమిని పైకి ఎత్తి... నివాసయోగ్యముగా జేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ప్రప్రథమ సార్వభౌముడు, మహా తపస్వి.

* దేవశిల్పి విశ్వకర్మ... ఈయన సత్యయుగంలో దేవతల నివాసమునకై స్వర్గపురిని నిర్మించి దేవతలకు ఆయుధములు, ఆభరణములు చేసి ఇచ్చాడు మనకు మహాభారతంలో కనబడే "మయసభ" సృష్టి కర్త.

* త్రేతాయుగంలో అయోధ్యను మరియు శివునికోసం సువర్ణ లంకను నిర్మించి ఇచ్చిన విశ్వకర్మ.

* ద్వాపరయుగంలో ద్వారకానగరం, ఇంద్రప్రస్థం, హస్తినాపురం మొదలగువాటిని నిర్మించిన విశ్వకర్మ.

* పురోచన విశ్వకర్మ ... ఈయన దుర్యోధనునికి లాక్షాగృహమును నిర్మించి ఇచ్చినవాడు.

* మయవిశ్వకర్మ... ఈయన త్రిపురములను నిర్మించిన వాడు.

ఇలా ఎందరెందరో విశ్వకర్మలు.... విశ్వకర్మ అనే ప్రధాన నామంతోనే సంబోధింపబడియున్నారు.

 విశ్వకర్మ వంశస్తులు ఎవరు..?

విశ్వకర్మ వంశస్తులు ఎవరు..?

మన భూ ప్రపంచానికి వ్యవసాయ శాస్త్రమును, రసాయణ శాస్త్రములను, గణిత శాస్త్రములను, అందించినవారుకూడా ఈ విశ్వకర్మలే. విశ్వకర్మ వశస్థులైన విశ్వబ్రాహణులు జ్యోతిష, వాస్తు, వైదిక క్రతువులు పౌరోహిత్యము చేయటలో నిష్ణాతులై ఉన్నారు. అన్నివృత్తులకు సంబంధించిన అన్నిరకాల పరికరాలను తయారు చేసి వాటిని ఉపయోగిస్తూ వస్తువులను తయారు చేసే విధానాలన్నింటినీ లోకానికి నేర్పించి అన్నిరకాల వృత్తులను ప్రవేశపెట్టింది విజ్ఞులైన ఈ విశ్వకర్మలే. సబ్బండ జాతులవారికీ వృత్తులను కల్పించి జీవనోపాధిని కలిగించారు. కాబట్టి సమాజం ఈ విశ్వకర్మలను, వారి వంశస్థులను "ఆచార్యులు, ఓజులు" అనే బిరుదులతో సత్కరించి ఆ విధంగానే గౌరవంగా సంబోధించడం జరుగుతున్నది.

"విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం"

ఋక్ వేదం లోని పదవ మండలం 81, 82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్టను గుర్తిస్తారు. విశ్వకర్మ యజ్ఞమహోత్సవాన్ని ప్రతీయేటా "సూర్యుడు కన్యారాశి" లోకి ప్రవేశించే కాలానికి అనగా సెప్టెంబర్ 17వ తేదీన ఎంతో ఘనమైన వేడుకగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో దీనినే దేవశిల్పి విశ్వకర్మ జయంతిగా భావించి ఎంతో వైభవంగా ఉత్సవములు జరుపుకుంటారు.

వర్షఋతువులో సూర్యుడు స్వక్షేత్రం నుండి కన్యారాశిలోకి ప్రయాణం ప్రారంభించినది మొదలు ఋతువులన్నీ అనుకూలిస్తూ... వర్షములు సమృద్ధిగా కురిసి సస్యవృద్ధి, పశువృద్ధి జరిగి లోకం సుభిక్షంగా ఉండాలనే బృహత్సంకల్పంతో జగత్ప్రభువైన విశ్వకర్మ భగవానుడి మహాయజ్ఞమహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. సకల చరచారాలకు, బ్రహ్మాండానికి పరమాత్మ అయిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని ఎవరైతే నిత్యం పూజిస్తారో.. వారికి ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కులాలతో సంబంధం లేకుండా విశ్వకర్మ భగవానుని ఫోటోను గృహంలో, వ్యాపార సంస్థలలో పెట్టుకుని భక్తిశ్రద్ధలతో నిత్య పూజ జరుపుకునే వారికి సమస్త దేవతలకు పూజ చేసిన పుణ్యఫలితం లభిస్తుంది. ఓం నమో విశ్వకర్మణే, జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ...

English summary
Vishwakarmaparamatma has no form or shape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X