భార్య కేసుతో భర్త ఆత్మహత్యాయత్నం: ఎయిర్‌పోర్టులో బుల్లెట్లు
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలో మంగళవారం దారుణ సంఘటన జరిగింది. భార్య తనపై పోలీసు కేసు పెట్టిందని ఓ భర్త మసస్తాపానికి గురయ్యాడు. దాంతో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి పరిస్థితిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో రైతు మృతి, భార్య ఆత్మహత్య
అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలం చాలవేములలో విషాదం సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున సుబ్బారెడ్డి అనే రైతు అప్పుల బాధతో గుండెపోటుతో మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు అనాథలుగా మారారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏనుగుల బీభత్సం, తమిళ మహిళ మృతి
చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం కొనసాగుతోంది. గత రాత్రి కుప్పం-కృష్ణగిరి అటవీప్రాంతంలో ప్రజలపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఏనుగుల బీభత్సంపై అటవీశాఖ పూర్తిగా దృష్టి సారించినప్పటికీ ఏనుగులను కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఏనుగుల దాడిలో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి.
రామకుప్పం మండలంలో ఇద్దరు, గుడిపల్లిలో ఒకరు, కుప్పంలో ఒకరు, వి.కోట మండలంలో ఒకరు ఏనుగుల దాడిలో చనిపోగా, పలు కారణాలతో మూడు ఏనుగులు మృతి చెందాయి. ఏనుగుల దాడిలోఓ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక్కొక్కరికీ రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించారు.
బుల్లెట్లు స్వాధీనం
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి రెండు బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి వెళ్తున్న ప్రసాద్ అనే వ్యక్తి నుంచి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత న్యూయార్క్ వెళ్తున్న రాజ్‌కుమార్ అనే విద్యార్థి నుంచి 9 ఎంఎం బుల్లెట్ లభ్యమైంది. ఇతడికి లైసెన్స్ కూడా లేదని అధికారులు గుర్తించారు. అయితే రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపు విచారించి వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాదులో కారు పల్టీ, ఇద్దరి మృతి
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం స్కోడా కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడి మృతి చెందారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications