అక్కడ అమ్మవారి విగ్రహం నుంచి రక్తం స్రవిస్తుంటుంది..!
న్యూఢిల్లీ: భారత్.. భిన్న సంస్కృతులు, విభిన్న విశ్వాసాలు, సంప్రదాయాలు, వేర్వేరు భాషలకు ప్రతీక. అందుకే- దసరా పండుగ సందర్భంగా కోట్లాదిమంది భక్తులు ఒక్కో చోట.. ఒక్కో రకంగా అమ్మవారిని పూజిస్తుంటారు. ప్రతి చోటా ఓ వైవిధ్యమే కనిపిస్తుంటుంది. ప్రత్యేకించి- అమ్మవారి శక్తిపీఠాల్లో దసరా మహోత్సవాలను వర్ణించడానికి మాటలు చాలవు. కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం మొదలుకుని మధుర మీనాక్షి అమ్మవారి దేవస్థానం వరకూ శరన్నవ రాత్రులు కన్నుల పండువగా నిర్వహిస్తుంటారు. అదే సమయంలో తిరుమలలో శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

వైష్ణోదేవి ఆలయం..
దసరా పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కొన్ని ప్రఖ్యాత అమ్మవారి ఆలయాల గురించి తెలుసుకుందాం. వైష్ణోదేవి ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. జమ్మూ కాశ్మీర్‌లోని త్రికూట పర్వతం మీద అమ్మవారు కొలువయ్యారు. కాట్రా జిల్లాలో ఉంటుందీ ఆలయం. మహా సరస్వతి, మహా కాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు గుర్తుగా త్రికూట పర్వతంగా పిలుస్తుంటారు. ఏటా లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శిస్తుంటారు. దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

అస్సాంలోని కామాఖ్య ఆలయం..
కామాఖ్య ఆలయం.. అస్సాంలోని గౌహతిలో ఉంది. శక్తి పీఠాలలో ఒకటి. శక్తిపీఠాల్లో అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తారు భక్తులు. ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. యోని రూపంలో ఏర్పడిన విగ్రహానికి భక్తులు పూజిస్తారు. విగ్రహం నుంచి ప్రతి నెలా మూడురోజుల పాటు రక్తం స్రవిస్తుంటుందని భక్తుల నమ్మకం. కామాఖ్య అమ్మవారికి బ్లీడింగ్ గాడ్డెస్‌గా పేరుంది. గౌహతి పశ్చిమ ప్రాంతంలోని నీలాచల్ పర్వతాల్లో వెలిశారు అమ్మవారు. భక్తులు అత్యధికంగా సందర్శించే దేవాలయాలలో ఇదీ ఒకటి.

దక్షిణేశ్వర్ కాళి ఆలయం..
దక్షిణేశ్వర్ కాళికా అమ్మవారి ఆలయం.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతలో ఉంది. 1855లో కాళీమాత భక్తురాలు రాణి రష్మోని ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలో ఉన్న అన్ని కాళీమాత ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధమైనది ఇది. భక్తులు ఏడాది పొడవునా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. శక్తిపీఠాల్లో ఇదీ ఒకటి. అమ్మవారి కుడి పాదం ఇక్కడ పడిందని విశ్వసిస్తారు. అమ్మవారు రౌద్రరూపంలో కనిపిస్తారు.

మహాలక్ష్మి ఆలయం
మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటైన కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మి ఆలయం. అంబా భవానీగా అమ్మవారిని కొలుస్తారు. చాళుక్యుల కాలంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 31, నవంబర్ 9వ తేదీల్లో సూర్య కిరణాలు అమ్మవారి పాదాలపై పడతాయి. ఫిబ్రవరి 1, నవంబర్ 10వ తేదీల్లో సూర్య కిరణాలు ఛాతీపై ప్రసరిస్తాయి. ఫిబ్రవరి 2, నవంబర్ 11వ తేదీల్లో విగ్రహం మొత్తాన్ని సూర్యకిరణాలు స్పృశిస్తాయి.

మీనాక్షి అమ్మవారు..
తమిళనాడులోని మధురైలో వెలిసిన మీనాక్షి అమ్మవారి ఆలయం శక్తిమంతమైనది. పార్వతీదేవిని మీనాక్షి రూపంలో కొలుస్తారు భక్తులు. దక్షిణాది రాష్ట్రాల్లో గల అమ్మవారి ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. పాండ్యులు ఈ దేవస్థానాన్ని నిర్మించారు. ఆలయం కట్టడం అద్భుతంగా ఉంటుంది. 2500 ఏళ్ల కిందటే సుందరేశ్వర్ ఆలయం నిర్మించారని చెబుతుంటారు. ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. ఎనిమిది గోపురాలు అన్నీ సమానంగా సరైన కోణంలో ఉండటం వీటి ప్రత్యేకత.

గుజరాత్‌లో అంబాజీ ఆలయం
గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉంది అంబాజీ. అమ్మవారు ఇక్కడ సింహారూఢురాలై దర్శనం ఇస్తారు. సతీదేవి హృదయం భాగం ఇక్కడ పడిందని భక్తులు నమ్ముతారు. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. దసరా ఉత్సవాల సమయంలో వందల కిలోమీటర్ల మేర కాలినడకన భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.












Click it and Unblock the Notifications