ప్రత్యేక ప్యాకేజ్ తో తెలంగాణాకు మోక్షం
హైదరాబాద్‌ః కష్టపడి సాధించుకున్నసమైక్యాంధ్రను వేర్పాటు వాదులు ముక్కలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే కొందరు తెలంగాణా రాష్ట్రం అంటూ పోరాటం ప్రారంభించారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణా ప్రాంత అభివృద్ధికి ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణా అభివృద్ధి లక్ష్యంతో శుక్రవారం సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే నిర్వహించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ధర్నాలు నిర్వహించింది. రాజధానిలోని సుందరయ్య పార్కులో జరిగిన ధర్నా కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. 610 జి.ఓ.ను పునరుద్ధరించాలని, రీజనల్ కౌన్సిల్స్ కు మళ్ళీ జీవం పోయాలని ఆయన డిమాండ్ చేశారు.
వెనుకబడిన తెలంగాణా ప్రాంతం అభివృద్ధికి ప్రాంతాలతో సంబంధం లేకుండా రాయలసీమ, కోస్తా ప్రజలంతా కూడా కృషి చేయాలని సురవరం అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
