హాస్యబ్రహ్మ జంధ్యాల హఠాన్మరణం
హైదరాబాద్: ప్రముఖ తెలుగుసినిమా రచయిత, దర్శకుడు జంధ్యాల మంగళవారం నాడు హైదరాబాద్‌లో గుండెపోటుతో హఠాన్మరం చెందారు. యాభై మూడేళ్ల జంధ్యాల పూర్తిపేరు జంధ్యాల వెంకటదుర్గ శివసుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు వున్నారు. పూర్తి ఆరోగ్యంగా వున్న జంధ్యాల సోమవారం మధ్యాహ్నం గుండెలో నొప్పిగా వున్నట్టు చెప్పారని వెంటనే ఆయన్ను మెడ్విన్ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో ఆయన మరణించారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
జంధ్యాల మరణవార్తవిని తెలుగుసినిమా పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. దర్శకునిగా తెలుగుతెరపై తనదైన మార్క్ హాస్యరసాన్ని పారించిన జంధ్యాల తొలుత మాటల రచయితగా సినిమారంగంలో అడుగుపెట్టారు. సినిమాల్లోకి రావడానికి ముందు నాటకరంగంలో ఆయన రచయితగా, ప్రయోక్తగా లబ్దప్రతిష్టులు. పుణ్యభూమి కళ్లు తెరువు నాటకంతో రంగస్థలంపై దుమారం సృష్టించిన జంధ్యాల సినిమాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు 400 సినిమాలకు మాటలు రాశారు.
విశ్వనాథ్ సిరిసిరిమువ్వతో ప్రారంభించి అడవిరాముడు, వేటగాడు, జగదేకసుందరి-అతిలోకవీరుడు వంటి పాపులర్ సినిమాలకు, శంకరాభరణం, ఆనందభైరవి వంటి అవార్డు చిత్రాలకు ఆయన మాటల రచయితగా వున్నారు. దర్శకునిగా ఆయన తొలిచిత్రం ముద్దమందారం కాగా చివరి సినిమా విచిత్రం.
1951లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన జంధ్యాల శ్రీవారికి ప్రేమలేఖ, రెండుజెళ్లసీత, వివాహభోజనంబు, రెండురెళ్లుఆరు, నాలుగుస్తంభాలాట, పడమటిసంధ్యారాగం, చంటబ్బాయి వంటి ఆరోగ్యవంతమై హాస్యంతో కూడిన అనేక చిత్రాలను ఆయన ప్రేక్షుకులకు అందించారు. హాస్యరసానికి సంబంధించి తెలుగుచిత్రపరిశ్రమలో ఆయనది ప్రత్యేకమైన వరవడి.
సుత్తివేలు జంట, బ్రహ్మానందం మొదలుకొని ఈ రోజు తెలుగు చలనచిత్రరంగాన్ని ఏలుతున్న అనేకమంది హాస్యనటులను ఆయనే
చిత్రరంగానికి అందించారు. వారిలోని ప్రతిభకు సానబెట్టారు.
జంధ్యాల మరణవార్త తెలిసినవెంటనే చిత్రపరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా మెడ్విన్ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. జంధ్యాల భౌతికకాయానికి బుధవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications