మణిపూర్‌లో చల్లారని మంటలు
ఇంఫాల్: కాల్పుల విరమణ ఒప్పందంపై మణిపూర్‌లో సాగుతున్న ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. కేంద్ర ప్రతినిధి బృందం ఐడి స్వామి సారధ్యంలో పరిస్థితిని మదింపు వేస్తున్నారు. గురువారం నాడు కర్ప్యూను, నిషేధాజ్ఞలను ధిక్కరించి వేలాది మంది మహిళలు కాగడాలతో ప్రదర్శన జరిపారు. పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మొహరించినప్పటికీ హెచ్చరికలు చేసినప్పటికీ మహిళలు చలించలేదు.
వారిని చెదరగొట్టడానికి భద్రతాదళాలు భాష్పవాయువు ప్రయోగించి, లాఠీ చార్జీ జరిపాయి. ఈ గొడవల్లో ఒక మహిళ మరణించింది. కాల్పుల విరమణను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం ఆగదని మణిపూర్ విద్యార్ధి సంఘం ప్రకటించింది. కాగా కేంద్రం ప్రతినిధులుగా ఇంఫాల్ చేరుకున్న ఐడి స్వామి బృందం స్థానిక ప్రజలు, పార్టీలు, నేతలతో మంతనాలు జరుపుతున్నది. ఈ బృందంలో శనివారం లోగా తన నివేదికను ప్రధాని వాజ్‌పేయికి సమర్పిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రధాని మణిపూర్ ఆందోళనపై నిర్ణయం తీసుకుంటారు. నాగా తీవ్రవాదులతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మణిపూర్‌కు విస్తరించడాన్ని వ్యతిరేకిస్తూ మణిపూరీలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే.












Click it and Unblock the Notifications