లాడెన్ సిక్సర్ కొట్టడంఖాయంః ఇమ్రాన్
ఇస్లామాబాద్‌ః పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయాల్లోకి ప్రవేశించి చేతులు కాల్చుకున్న ఇమ్రాన్‌ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడులకు దిగిన అమెరికాపై విరుచుకుపడ్డారు. ఆఫ్ఘన్ పై అమెరికా ప్రారంభించిన యుద్ధానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇమ్రాన్‌ఖాన్ సిఎన్‌ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆఫ్ఘన్ పై పడే ప్రతిబాంబు ముస్లింలలో ఆవేశాన్ని పెంచుతుందని ఆయన అన్నారు.
పాక్ క్రికెట్ రంగానికి పెద్దదిక్కుగా వున్న ఇమ్రాన్ ప్రస్తుతం లాహోర్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. గత ఎన్నికల్లోఘోరపరాజయం పాలైనా రాజకీయాలపై ఆయనకు ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు.ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ, ఆర్ధికశాస్త్రాలను అభ్యసించిన ఇమ్రాన్‌ఖాన్ యుద్ధంపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించాడు.
అమెరికా దాడులకుసరైన లక్ష్యం లేదని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘన్ లో తలదాచుకుంటున్న లాడెన్ ను పట్టుకొని న్యాయపరంగా శిక్షించాల్సింది పోయి యుద్ధం ప్రకటించడంఅర్థ రహితం అని ఆయన అన్నారు. దాడులు తీవ్రంఅయిన కొద్దీ అమెరికా ఊహించని విధంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికాలో వున్న ఇజ్రాయెల్ లాబీ ఈ దాడులకు కారణం అని ఆయన దుమ్మెత్తి పోశారు. అమెరికా వద్ద శిక్షణ పొందిన లాడెన్ ను పట్టుకోవడం అంత తేలిక కాదని ఇమ్రాన్ అన్నారు. అమెరికా లాడెన్ ను చంపితే ముస్లింల పాలిట ఆయన దేవుడు అవుతాడని ఇమ్రాన్ అన్నారు.సరైన సాక్ష్యాలు చూపించి లాడెన్ ను అంతర్జాతీయ న్యాయస్థానంలో శిక్షించవచ్చు కదా అని ఆయన సూచించారు. అమెరికా దాడుల వల్ల పాకిస్తాన్ లో ఛాందసవాదం మరింత బలపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications