నెతన్యాహుకు ట్రంప్ బిగ్ షాక్ - ఎన్నికల్లో ఎదురుదెబ్బతో సంచలన నిర్ణయం..!
ఇన్నాళ్లూ ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నా ఇజ్రాయెల్ కోసం ఇరాన్ పై యుద్దం చేసి పశ్చిమాసియాలో ఇతర మిత్రదేశాలకూ ముప్పు తెచ్చి పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై ఇప్పుడు స్వదేశంలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ పై అవసరం లేని యుద్దం చేసి, దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ట్రంప్ పై స్వదేశంలో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలకు ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయి. దీంతో ఓటర్లలో ఆగ్రహాన్ని గ్రహించిన ట్రంప్.. ఇజ్రాయెల్ పై ఎట్టకేలకు కఠిన వైఖరి అవలంబించేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇజ్రాయెల్ కు ప్రస్తుతం అమెరికా ఏటా అందిస్తున్న 4 బిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపేయాలని ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నుంచి ఈ సాయం ఆగిపోతున్నట్లు ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఇప్పటికే ఓ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ తెలిపారు. దీని ప్రకారం ఇకపై ఇజ్రాయెల్ కూడా ఇతర దేశాల తరహాలోనే ఆయుధాల్ని అమెరికా నుంచి కొనుగోలు చేసుకోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఎలాగో ఆర్ధికంగా బలమైన దేశమే కాబట్టి అమెరికా సాయం లేకుండానే తమ రక్షణ అవసరాలు తీర్చుకుంటుందని ట్రంప్ తేల్చిచెప్పేశారు.

వాస్తవానికి ఇజ్రాయెల్ తో ఉన్న ఒప్పందం మేరకు ఆ దేశానికి అమెరికా 2028 డిసెంబర్ వరకూ ఏటా 3.8 బిలియన్ల సాయాన్ని అందించాల్సి ఉంది. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా ట్రంప్ ఈ సాయం నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్ధిక సాయం ఆపేసినా ఇజ్రాయెల్ తో సైనిక బంధం మాత్రం కొనసాగిస్తుందని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ లో తాజాగా జరిగిన ఎన్నికల్లో నెతన్యాహుకు ప్రజామద్దతు తగ్గిపోయినట్లు తేలడం, అదే సమయంలో ఇరాన్ వార్ విషయంలో అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటమే ట్రంప్ నిర్ణయానికి కారణాలుగా తెలుస్తోంది. అయితే నిండా మునిగాక ఇప్పుడు ఏం చేసి ఏం ఉపయోగమన్న వాదన సగటు అమెరికన్లలో వినిపిస్తోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లను కాదని డెమోక్రాట్లను ప్రజలు ఆదరిస్తుండటంతో ఇకపై యూఎస్ కాంగ్రెస్ లో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని తేలిపోయింది.














Click it and Unblock the Notifications
