వందేభారత్ స్లీపర్‌లో స్టార్ హోటల్ ఫుడ్ - ఎవరు తయారు చేస్తారు,మెనూ ఇదే..!!
గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ప్రయాణికులకు భారతీయ రైల్వేస్ అందించిన వరం వందేభారత్ ఎక్స్‌ప్రెస్. పరిమిత స్టాపులతో వేగంగా ప్రయాణించే ఈ రైలులో చాలా ప్రత్యేకతలే ఉన్నాయని చెప్పాలి. ముందుగా సీటింగ్ కోచ్‌లతో ప్రారంభమైన ఈ సెమీ హైస్పీడ్ రైలు.. ఆ తర్వాత స్లీపర్కోచ్లతో కూడా పట్టాలపై పరుగులు పెడుతోంది. తాజాగా నవంబర్ 1వ తేదీన ముంబై-బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ రైలులో చాలా విశిష్టతలున్నాయి.ఈ ట్రైన్లో ఎలాంటి ఆహారం అందిస్తున్నారు..ఎవరు తయారు చేస్తున్నారు..రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.
స్టార్ హోటల్లో వడ్డించే ఆహారం
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ ప్రయాణికులకు ఒక వరంగా మారడంతో పాటు ఒక ఎమోషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు విమానంలో ప్రయాణం చేసినంత అనుభూతి పొందుతారు.ఇక ఈ సెమీ హైస్పీడ్ వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆధునాతన ఇంటీరియర్ దీని సొంతం. అత్యంత సౌకర్యవంతమైన బెర్తులతో పాటు లగ్జరీ ఎమినిటీస్ ఈ రైలులో ఉన్నాయి. వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించే ఆహారం మరో లెవెల్ అనే చెప్పాలి. ఈ రైలులో సర్వ్ చేసే ఫుడ్ ఫైవ్ స్టార్ హోటల్‌కు ఏమాత్రం తీసిపోదని ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు.

రైలు ప్రయాణం ప్రారంభమైన కొద్ది గంటలకే మంచి భోజనంతో కూడిన ప్లేట్‌ను ట్రైన్ సిబ్బంది సర్వ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.అయితే అందులో ఎలాంటి ఐటెమ్స్ సర్వ్ చేశారన్న విషయమైతే చెప్పలేదు కానీ... ఆ రుచి మాత్రం చాలా బాగుందని ఒక ప్రీమియం హోటల్‌కు ఏమాత్రం తీసిపోదని సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక మరో వ్లాగర్ కూడా తన అనుభవాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించిన పప్పు (దాల్),నోరూరించే చికెన్ గ్రేవీ, సుతిమెత్తగా ఉండే రోటీలు అత్యద్భుతంగా అభివర్ణించాడు. అంతేకాదు ఈ ఆహార పదార్థాలన్నీ సరోవర్ పోర్టికో అనే ఫోర్ స్టార్ హోటల్ తయారు చేస్తోందంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ముంబై-బెంగళూరు వందేభారత్ స్లీపర్ ఫుడ్ మెనూ
ఐఆర్సీటీసీ(IRCTC)పొందుపర్చిన వివరాల ప్రకారం కొత్తగా పట్టాలెక్కిన వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లలో ఉదయం టిఫెన్ రాత్రి భోజనంకు సంబంధించి ప్రాంతీయ వంటకాలు ఉంటాయని పేర్కొంది.రాత్రి భోజన మెనూలో లెమన్ రైస్ లేదా స్టీమ్డ్ రైస్,చపాతి, పరాఠ, కర్నాటక స్టయిల్లో చేసే సాంబర్ లేదా పప్పు.వీటితో పాటు పన్నీర్ లేదా చికెన్ కూడా సర్వ్ చేస్తారు. పెరుగు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు స్వీట్స్‌ను కూడా మెనూలో చేర్చడం జరిగింది.
ఉదయం టిఫిన్‌కు ఇడ్లీ,వడ, సాంబార్, మసాలా పోహా, వెజిటిబుల్ ఉప్మా,బ్రెడ్, వెజ్ కట్లెట్, ఆమ్లేట్తో పాటు మరికొన్ని టిఫిన్లు సర్వ్ చేస్తారు.వీటితో పాటు టీ,కాఫీ, బిస్కెట్లు కూడా ప్రయాణికులకు అందిస్తారు.
ముంబై బెంగళూరు వందేభారత్ స్లీపర్ టికెట్ ధరలు
ముంబై-బెంగళూరు వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ (27651) ఒక్క మంగళవారం తప్ప వారంలో మిగతా ఆరు రోజులు నడుస్తుంది. అదే సమయంలో బెంగళూరు - ముంబై వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ (27651) సోమవారం తప్ప మిగతా ఆరు రోజులు నడుస్తుంది.టికెట్ ధరల విషయానికొస్తే బెంగళూరు - ముంబై రూట్లో థర్డ్ ఏసీ రూ.2810 ఉండగా..సెకండ్ ఏసీ రూ.3630, ఫస్ట్ ఏసీ రూ.4,450గా నిర్ణయించారు.
మొత్తానికి టికెట్ ధర కాస్త ఎక్కువైనప్పటికీ వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలుతో బెంగళూరు నుంచి ముంబైకి ప్రయాణ సమయం దాదాపుగా 11 గంటలు తగ్గనుంది.అదే సమయంలో మంచి లగ్జరీ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు రుచికరమైన ఆహారం అందిస్తుండటంతో ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
