ఇస్లామాబాద్‌ః ఇస్లామాబాద్‌లోని ఒక కీలకమైన ప్రభుత్వ భవనంలో బుధవారం నాడు జరిగిన అగ్నిప్రమాదం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలవరం రేకెత్తిస్తున్నది. ఈ భవనంలో అనేక మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యాలయాలు వున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ మధ్యనే నిషేధించిన తీవ్రవాద సంస్థలకు సంబంధించిన రికార్డులు ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్టుగా చెబుతున్నారు.
కీలకమైన రికార్డులన్నీ నాశనమైనట్టుగా వార్తలు రావడంతో పాక్ ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీచేసింది. 16 అంతస్తులున్న ఈ భారీ భవనంలో పది అంతస్తులు అగ్ని ప్రమాదంలో దగ్ధమైనట్టుగా అధికారులు చెప్పారు. దాదాపు అయిదుగంటల పాటు అగ్నిమాపక సిబ్బంది హోరాహోరీగా పోరాడితే గానీ మంటలు అదుపులోకి రాలేదు. పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖతో పాటు సుమారు పదిహేను మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఈ భవనంలో వున్నట్టుగా తెలిసింది. తీవ్రవాద సంస్థలకు సంబంధించిన రికార్డులతో పాటు వేలసంఖ్యలో జారీ చేసిన ఆయుధలైసెన్సుల వివరాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమైనట్టుగా తెలిసింది. ఈ ప్రమాదానికి విద్రోహం కారణమై వుండవచ్చనే అంటున్నారు.