Vijay: మళ్లీ లుక్ మార్చిన విజయ్..! కూటమికి కొత్త పేరు ప్రకటన వేళ..!
తమిళనాడులో టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి, రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ (Joseph Vijay) విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే గతంలో సీఎం కాక ముందు సామాన్యుడిగా దుస్తులు ధరించి కనిపించిన విజయ్.. సీఎం అయ్యాక మాత్రం బ్లేజర్ సూట్ లోకి వచ్చేశారు. తమిళనాడులో సంప్రదాయ పంచెకట్టు, ధోతీకి బదులుగా విజయ్ ఇలా బ్లేజర్ సూట్ ధరిస్తుండటంపై ఇప్పటికే అక్కడ విమర్శలు వినిపిస్తుంటాయి. వీటిని ఎక్కువగా పట్టించుకోని విజయ్.. అప్పుడప్పుడూ మాత్రం తన లుక్ మారుస్తున్నారు.
గతంలో సీఎం అయిన రెండు నెలల తర్వాత ఒక రోజు ఉన్నట్లుండి అధికారుల్ని కలుసుకునే సందర్బంలో విజయ్.. తమిళనాడు సంప్రదాయ పంచె కట్టులో కనిపించారు. ఎప్పుడూ బ్లేజర్ లో కనిపించే విజయ్.. ఇలా పంచె కట్టులో కనిపించే సరికి అధికారులు కూడా ఆయన్ను కొత్తగా చూస్తూ కనిపించారు. కానీ విజయ్ మాత్రం తన మార్క్ చిరునవ్వుతోనే కనిపించారు. అప్పట్లో ఈ సీన్ చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరోసారి విజయ్ పంచెకట్టులోకి మారారు. తాజాగా ఏర్పాటు చేసిన కూటమి భేటీ ఇందుకు వేదికైంది.

తమిళనాడులో ప్రస్తుతం తాను నడుపుతున్న కూటమికి విజయ్ కొత్త పేరు ఖరారు చేశారు. పనయూర్ లోని టీవీకే కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయ్.. కూటమిలోని అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించి, వారి సమక్షంలోనే కూటమికి సెక్యూలర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్ అనే పేరు పెట్టారు. అలాగే కూటమి నాయకుడిగా విజయ్ ను వారు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ బంగారపు రంగు ధోతీ, పంచెకట్టులో కనిపించారు. కూటమి పవిత్రతకు గుర్తుగా విజయ్ ఇలా సంప్రదాయ పంచెకట్టు ధరించినట్లు తెలుస్తోంది. స్టాలిన్ ను విమర్శించే విషయంలో కూటమి పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతున్న వేళ విజయ్.. సంప్రదాయంగా కనిపించడంతో పాటు, పద్దతి ప్రకారం కూటమికి కొత్త పేరు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.














Click it and Unblock the Notifications
