విజయ్ పొలిటికల్ అలయెన్స్ కు కొత్త పేరు ఇదే..
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త రాజకీయ కూటమికి కొత్త పేరు ఖరారైంది. ఈ పొలిటికల్ అలయెన్స్ కు సెక్యూలర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్ అనే పేరు పెట్టారు. ఈ కూటమి తమ నాయకుడిగా టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ పేరును ప్రకటించింది. పనయూర్ లోని టీవీకే కేంద్ర కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన రెండో కూటమి సమావేశంలో ఈ మేరకు కూటమి పార్టీలు ఈ పేరును ప్రకటించాయి. సీఎం విజయ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన మీటింగ్ సుమారు గంటన్నరపాటు జరిగింది. ఇక ఈ కూటమిలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, ఎండీఎంకే పార్టీలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత, తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు మానిక్ రామ్ ఠాగూర్, తరగాయ్ కత్బర్ట్, ప్రవీణ్ చక్రవర్తి హాజరయ్యారు. అలాగే వీసీకే పార్టీ తరఫున తోల్ తిరుమావలవాన్, వన్ని అరసు, రవి కుమార్, సింధానై సెల్వన్ హాజరయ్యారు. ఇక ఎండీఎంకే తరఫున వైఖో, దురాయ్ వైఖో హాజరు కాగా ఐయూఎంఎల్ తరఫున కేఎమ్ కాదర్ మోహినుద్దీన్, షాజహాన్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో మానిక్ రామ్ ఠాగూర్ మాట్లాడుతూ.. ఈ పేరే తమ కూటమి సిద్ధాంతాలను, అజెండాను తెలియజేస్తోందని అన్నారు. తమిళనాడు ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే పార్టీలన్నీ ఈ కూటమిలో ఉన్నాయని స్పష్టం చేశారు. రానున్న బై పోల్స్ లో కూటమి ఉమ్మడిగానే పోటీ చేస్తుందని తెలిపారు.

ఇక ఇప్పటికే టీవీకే పార్టీ తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి కంచు కోటలను బద్దలు కొట్టి 108 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో పార్టీ పెట్టి పోటీ చేసిన తొలిసారే విజయ్ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు మిగతా పార్టీలు కూడా టీవీకే తో జతకట్టి కూటమిగా అవతరించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలను మరింత ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications
