ఈ నెల 16న తిరుమలలో శ్రీనివాసుడికి పుష్పార్చన: రద్దయిన ఈ సేవలు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదిావారం నాడు ఏకంగా 78,228 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,564 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.01 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 2.36 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారాన్ని అందిస్తోన్నారు.

కాగా.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16వ తేదీన పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారం కన్నుల పండువగా దీన్ని నిర్వహించనున్నారు టీటీడీ అర్చకులు. ఈ ఉత్సవానికి ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా టీటీడీ అధికారులు పూర్తి చేస్తోన్నారు.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. దీని తర్వాత అసలు ఘట్టం ఆరంభమౌతుంది.
మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహిస్తారు. మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవిలకు వందల రకాల పూలతో అలంకరిస్తారు. అనంతరం స్వామివారు దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. సాయంత్రం వేళ.. సహస్రదీపాలంకార సేవ తరువాత ఈ ఊరేగింపు ఉంటుంది. ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు కటాక్షిస్తారు. ఈ నేపథ్యంలో 16వ తేదిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.













Click it and Unblock the Notifications
