మాణిక్కం ఠాగూర్ తో టీవీకే ట్రబుల్ షూటర్ ఆధవ్ అర్జున భేటీ: ఈ నెల 9న తేలుతుంది..!!
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే కూటమిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా విభేదాలు రచ్చకెక్కాయి. 2029 నాటి లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై టీవీకే, దాని భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ మధ్య ఘర్షణపూరక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీనన టీవీకే తన మిత్రపక్షాలతో సమావేశం కానుంది.
విజయ్‌ను 2029 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ టీవీకే నేతలు చేస్తున్న డిమాండ్లు ఈ వివాదానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలోనే సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే పార్టీను ఈ నెల 9వ తేదీ నాటి సమావేశానికి ఆహ్వానించారు టీవీకే నేతలు. కూటమిలో అతిపెద్ద భాగస్వామ్య పక్షం కాంగ్రెస్‌కు ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిస్థితుల మధ్య టీవీకే ట్రబుల్ షూటర్, మంత్రి ఆధవ్ అర్జున తెరపైకి వచ్చారు. కొద్దిసేపటి కిందటే ఆయన చెన్నైలో తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఎంపీ మాణిక్కం ఠాగూర్ తో భేటీ అయ్యారు. 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన టీవీకే మిత్రపక్షాల సమావేశానికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. టీవీకే మంత్రులు స్వయంగా వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిసి ఆహ్వానించడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది.
చెన్నైలోని రాయపేటలో గల కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన టీవీకే మంత్రులు ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జున, అరుణ్‌రాజ్..మాణిక్యం ఠాగూర్, కాంగ్రెస్ ఎంపీ ప్రవీణ్ చక్రవర్తిలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 9న జరిగే సమావేశానికి రావాలని కోరారు. ఈ భేటీలో రాబోయే రాజకీయ పరిణామాలు, పొత్తుల బలోపేతంపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది. పొత్తులపరంగా టీవీకే- కాంగ్రెస్ మధ్య ఈ సమావేశం కీలకం.
కాంగ్రెస్‌నే కాకుండా, ఇతర మిత్రపక్షాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది టీవీకే. ఇందులో భాగంగా మంత్రులు.. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు వీరపాండ్యన్, షణ్ముగం, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకోలను వారి కార్యాలయాల్లో వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు కూడా. గతంలో జూలై 1న జరిగిన మొదటి విడత చర్చలకు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీలు హాజరయ్యాయి. ఆ సమయంలో వామపక్షాలు దూరంగా నిలిచాయి.
ఈ నేపథ్యంలోనే ఈసారి వామపక్షాలను కూడా ఒకే తాటిపైకి తీసుకురావాలనే పట్టుదలతో టీవీకే నాయకత్వం ఉంది. ఇదిలావుండగా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య ప్రధాని అభ్యర్థి విషయంపై చర్చ నడుస్తోంది. విజయ్ వైపే టీవీకే శ్రేణులు మొగ్గు చూపుతున్నాయి. విజయ్ ప్రధాని అభ్యర్థి కావాలంటూ ఆకాంక్షిస్తోన్నాయి. కాంగ్రెస్ దీన్ని విభేదిస్తోంది. రాహుల్ గాంధీ కాకుండా మరెవరినీ ప్రధాని అభ్యర్థిగా అంగీకరించబోమని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 9న జరగబోయే మిత్రపక్షాల సమావేశంపై అందరి చూపూ నిలిచింది.














Click it and Unblock the Notifications