హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్.. తెలంగాణా సర్కార్ కీలక అడుగు!
తెలంగాణా రాష్ట్రంలో రైల్వే ప్రగతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాటలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ నుండి హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తెలంగాణా ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేపట్టింది. హైదరాబాద్ ను దక్షిణ భారత దేశంలోని ప్రధాన హైస్పీడ్ రైల్ కారిడార్ గా ఏర్పాటు చేయటానికి తెలంగాణా సర్కార్ కీలక అడుగు వేసింది.
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొత్త హై స్పీడ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి రైల్వే బోర్డు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బాధ్యతలను అప్పగించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ముఖ్యమైన రవాణా కేంద్రంగా ఎదుగుతుంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ రైల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో బహదూర్ గూడ లో ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ ఏర్పాటు చేయడానికి భారీగా భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొత్తం 796.28 ఎకరాల భూమిని సేకరించడానికి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రాధమిక నోటిఫికేషన్ విడుదల చేశారు.
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బహదూర్ గూడ గ్రామంలో సుమారు 650 ఎకరాల భూమిని బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం గుర్తించారు. ఈ భూమి సర్వే నెంబర్లు 28 మరియు 62 లో ఉన్నాయి. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోనిదే కావడంతో భూసేకరణ ప్రక్రియ సులభంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సరిహద్దుల గుర్తింపు పనులు చేపట్టారు.
ఈ హబ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై కు ప్రతిపాదిత హై స్పీడ్ రైలు కారిడార్లకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ల డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ 2026 సెప్టెంబర్ నుంచి 2027 మార్చి మధ్య పూర్తయ్యే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ ముంబై కారిడార్ డి పి ఆర్ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అవకాశం ఉంది.
ఏది ఏమైనా ఈ హై స్పీడ్ రైలు కారిడార్ పనులను వేగవంతం చేయడానికి అధికారులు ప్రీ కన్స్ట్రక్షన్ పనులు కాంట్రాక్ట్ పత్రాల తయారీ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ చర్యలతో బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటు మరింత వేగవంతంగా సాగుతుంది.













Click it and Unblock the Notifications
