'చింతగింజలకు ఉప్పు': దీని వెనుక ఇన్ని కోట్ల బిజినెస్ ఉందా? తెలుసుకుంటే షాకే!
Tamarind Seeds: గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో వీధుల్లో తిరుగుతూ 'చింతగింజలకు ఉప్పు' అంటూ వ్యాపారులు కేకలు వేయడం మనం తరచుగా వింటూ ఉంటాం. పాతకాలం నుంచి వస్తున్న ఈ పద్ధతి వెనుక పెద్ద వ్యాపార సూత్రంతో పాటు ఎన్నో పారిశ్రామిక ఉపయోగాలు దాగి ఉన్నాయి. ఇళ్లలో చింతపండును ఉపయోగించిన అనంతరం పారేసే చింతగింజలను ఉప్పు ఇచ్చి సేకరించడం ద్వారా గ్రామీణ మహిళలకు కొంత ప్రయోజనం చేకూరడమే కాకుండా.. వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియ సాగుతోంది.
సేకరించిన చింతగింజలను ముందుగా పెద్ద పెద్ద మిల్లులకు లేదా ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తారు. అక్కడ చింతగింజలపై ఉండే గట్టి పొట్టును తొలగించి లోపల ఉండే తెల్లటి గింజల భాగాన్ని వేరు చేస్తారు. ఆ గింజలను ఎండబెట్టి, బాగా గ్రైండ్ చేసి తెల్లటి పౌడర్‌గా మారుస్తారు. దీనిని పారిశ్రామిక పరిభాషలో 'టామరిండ్ కెర్నల్ పౌడర్' అని పిలుస్తారు. ఈ పౌడర్లో చిక్కదనాన్ని ఇచ్చే గుణం ఎక్కువగా ఉండటంతో వివిధ పరిశ్రమల్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.

చింతగింజల పౌడర్‌ను ప్రధానంగా టెక్స్‌టైల్ (చేనేత, మగ్గం) రంగానికి సంబంధించి బట్టలకు గంజి పెట్టడానికి, రంగులు అద్దడానికి(డైయింగ్) ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే పేపర్ పరిశ్రమలో కాగితానికి దృఢత్వాన్ని ఇవ్వడానికి, ప్లైవుడ్, కార్డ్‌బోర్డ్ తయారీలో గట్టి జిగురుగా(Adhesive) దీనిని వాడతారు. ఇది కాకుండా కాస్మెటిక్స్ తయారీలో షాంపూలు, సబ్బులలో సహజసిద్ధమైన చిక్కదనం కోసం ఈ పౌడర్ ను ఓ బైండర్‌గా ఉపయోగిస్తుంటారు.
ఇటీవలి కాలంలో చింతగింజల పిండిని పశువులు, కోళ్లు, చేపల దాణాలో కూడా పోషక విలువలు పెంచడానికి కలుపుతున్నారు. గ్రామాల్లో వ్యర్థంగా భావించి పారేసే చింతగింజలు అనేక రకాల భారీ పరిశ్రమలలో అత్యంత కీలకమైన ముడిసరుకుగా మారి రూపాంతరం చెందుతున్నాయి. చిన్నపాటి ఉప్పు ఇచ్చి కొనుగోలు చేసే ఈ గింజల వెనుక ఇంత పెద్ద పారిశ్రామిక సైరిల్ తిరుగుతుండటం గమనార్హం.
చింతగింజలతో మరెన్నో ఉపయోగాలు
చింతగింజలు ఆయుర్వేదం ప్రకారం మరెన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను నయం చేయడంతో పాటు వీటిని ఆయుర్వేద వైద్య విధానంలో పలు ఔషధాలను తయారు చేసేందుకు, వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారు. చింత గింజలు జీర్ణశక్తిని పెంచుతాయి. ఈ గింజలు జీర్ణ సమస్యలను తగ్గించడంతో పాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చింతగింజలను తీసుకోవడం వల్ల పైత్య రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. చింత గింజలు షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ చింతగింజలను తినడం వల్ల నొప్పులు, వాపులు తగ్గిపోవడంతో పాటు ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు, మోకాళ్ల సమస్యలు ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. ఈ చింతగింజలను తినడం వల్ల కీళ్లలో గుజ్జు పెరుగుతుంది. ఈ చింతగింజల్లో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం అధికంగా ఉండటంతో కీళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి సహాయం చేస్తాయి. చింతగింజలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ చింతగింజలు దంతాలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. చింత గింజల పొడితో దంతాలను తోముకోవచ్చు. దీని వల్ల నోట్లో ఉన్న బాక్టీరియా నశించడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంచాయి. ఇలా చింత గింజలను వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.













Click it and Unblock the Notifications
