అమలాపురంః దివంగత నేత బాలయోగి భౌతిక కాయం రాజమండ్రి నుంచి అమలాపురం మీదుగా సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆయన స్వగ్రామం ఎదుర్లంక గ్రామానికి చేరుకున్నది. బాలయోగి భౌతిక కాయాన్ని వుంచిన ప్రత్యేక వాహనం ఎదుర్లంక చేరుకోగానే ఆ ఊరు పుత్రశోకం గోదావరి వరదే అయింది.ఊరుఊరంతా విలపిస్తుంటే ఓదార్చేవారు లేకుండా పోయారు. రాజమండ్రి నుంచి ఎదుర్లంకకు చేరుకోవడానికి పదిహేను గంటలు పైగా పట్టింది. ఎదుర్లంక వరకు దాదాపుఅన్ని గ్రామాల్లోనూ ప్రజలు స్పీకర్ భౌతిక కాయం కోసం ఎదురుచూస్తూ రహదారుల కిరువైపుల వేల సంఖ్యలో నిలబడ్డారు. దారిపొడవునా అశ్రుతర్పణాలు వదిలారు.
స్వగ్రామం నుంచి బాలయోగి భౌతికకాయాన్ని తిరిగి అమలాపురం తీసుకువెళ్లుతున్నారు. అమలాపురంలో బుధవారం నాడు అంత్య క్రియలకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంత్యక్రియలకు ప్రధాని వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులతో సహా అనేక మందివివిఐపిలు పాల్గొంటున్న కారణంగా అసాధార రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రత్యేక కమెండో దళం ఇప్పటికే కోనసీమకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నది. ఏడు వేల మంది పోలీసులను మొహరించినట్టుగా జిల్లా అధికారులు చెప్పారు. బాలయోగి అంత్యక్రియాల్లో పాల్గొనే వారి కోసం దక్షిణ మధ్యరైల్వే మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకరైలు కూడా వేసింది. ఈ రైలు బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకుంటుంది. తిరిగి బుధవారం సాయంత్రం అక్కడ బయలుదేరి గురువారం ఉదయం కల్లా సికింద్రాబాద్ వస్తుందనిరైల్వే అధికారులు చెప్పారు.