ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన మెగాస్టార్ సినిమా 10 రోజుల్లేనే డీలాపడింది.. కారణం?
టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో రికార్డులను తిరగరాయడం మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు. ఆయనిచ్చినన్ని ఇండస్ట్రీ హిట్లు మన దగ్గర మరే హీరో ఖాతాలోనూ లేవు. అయితే, కొన్ని సినిమాలు మాత్రం రికార్డుల సునామీ సృష్టిస్తూ, ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్లి కూడా ఆఖరి నిమిషంలో ఆ రేసులో వెనకబడిపోయాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ క్లాష్ కథే ఇది! గతంలో చిరంజీవి వరుస ప్లాపుల్లో ఉన్న సమయంలో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య 'హిట్లర్' రూపంలో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చి మెగాస్టార్‌ను మళ్లీ గ్రాండ్‌గా ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. ఆ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో మళ్లీ అదే క్రేజీ కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రమే 'అన్నయ్య'.
సౌందర్య, రవితేజ, వెంకట్
సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రవితేజ, వెంకట్.. చిరంజీవి తమ్ముళ్లుగా కనిపించారు. మెగాస్టార్ కామెడీ టైమింగ్, సౌందర్యతో ఆయన కెమిస్ట్రీ, అన్నదమ్ముల మధ్య పండిన ఎమోషన్స్, మణిశర్మ అందించిన చార్ట్‌బస్టర్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. జనవరి 4న విడుదలైన 'అన్నయ్య' తొలి రోజు నుంచే థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. టాక్ అద్భుతంగా ఉండటంతో వారం రోజులు గడిచినా వసూళ్ల హోరు ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ ట్రెండ్ చూసిన ట్రేడ్ విశ్లేషకులు, అభిమానులు.. చిరంజీవి ఖాతాలో మరొక ఇండస్ట్రీ హిట్ పడటం ఖాయమని గట్టిగా నమ్మారు.

10 రోజులకే అనూహ్య మలుపు
అయితే, కథ ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది. 'అన్నయ్య' విడుదలైన సరిగ్గా 10 రోజులకు సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన 'కలిసుందాం రా' థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ప్రభంజనం అపూర్వం. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సెంటిమెంట్, కామెడీతో కుటంబ ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది. దాంతో అప్పటివరకు థియేటర్ల వైపు క్యూ కట్టిన ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారిగా 'కలిసుందాం రా' వైపు మొగ్గుచూపారు.
'కలిసుందాం రా' సృష్టించిన ఈ అనూహ్యమైన వేవ్ వల్ల 'అన్నయ్య' కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటికే 'అన్నయ్య' బ్లాక్‌బస్టర్ హిట్ స్టేటస్ అందుకున్నప్పటికీ, రావలసిన అత్యధిక వసూళ్లకు బ్రేకులు పడటంతో ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది.ఏదేమైనా, ఒకే పండుగ సీజన్‌లో ఇద్దరు బడా హీరోల సినిమాలు వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి పోటీని ఇవ్వడం టాలీవుడ్ చరిత్రలోనే ఒక రేర్ బాక్సాఫీస్ మూమెంట్‌గా నిలిచిపోయింది!














Click it and Unblock the Notifications
